మలప్పురం ఏనుగు మృతిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనకు మానవాళి సిగ్గుపడాల్సి వస్తోందని .. ప్రముఖులు, సామాన్యులు ట్వీట్లతో బాధను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏనుగు మృతి కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇంతకూ ఏనుగు మృతిపై పోస్టు మార్టం రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. 

 

కేరళలోని మలప్పురంలో దారుణ వధకు గురైన ఏనుగు పోస్ట్ మార్టం రిపోర్టు.. కీలక విషయాలను వెల్లడించింది. పేలుడు పదార్థాలు నింపిన కొబ్బరికాయ తిన్న 14 రోజుల తర్వాత ఏనుగు చనిపోయిందని తెలిపింది. పేలుడు తీవ్రతకు నోటిలో తీవ్రగాయాలయ్యాయని... తీవ్ర నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు బాధతో విలవిలలాడిందని తేల్చింది. ఆ పద్నాలుగు రోజులు తిండి, నీరు తీసుకోలేక  ఏనుగు ... తీవ్రక్షోభను అనుభవించిందని వెల్లడించింది. నీళ్లు కూడా తాగకుండా ఆకలితో అలమటించి, ఒకరోజు మొత్తం నదిలో ఉండిపోయిందని నివేదికలో వైద్యులు తెలిపారు. చివరకు ఆ ఏనుగు నీరసించి, నీటిలో పడిపోయిందని వివరించారు. ఏనుగు మృతికి ఊపిరితిత్తుల వైఫల్యమే కారణమన్నారు.

 

మరోవైపు ఏనుగు హత్య కేసులో ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టైన వ్యక్తి స్థానికంగా ఉన్న ఎస్టేట్‌లో ఉద్యోగిగా గుర్తించారు. సమీపంలో కమర్షియల్ పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు దుండగుల చేతిలో ఏనుగు హత్యకు గురికావడంపై ... దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాల వెల్లువెత్తుతోంది. తల్లి ఏనుగు కడుపులో గున్న ఏనుగుతో పలువురు చిత్రకారులు వేసిన కార్టూన్లు హృదయాన్ని ద్రవింపజేసేలా ఉన్నాయి. చనిపోయిన ఆడ ఏనుగు, దాని కడుపులోని పిల్ల బాధలను ఈ కార్టూన్లు కళ్లకు కడుతున్నాయి.

 

ఈ ఘటనతో మానవాళి సిగ్గుపడాల్సి వస్తోందని చిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాలు తమతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తల్లి ఏనుగు, గున్న ఏనుగుకు సంబంధించిన ఈ కార్టూన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: