దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల్లో కేంద్రం అనేక సడలింపులు ఇచ్చింది. సడలింపుల్లో భాగంగా ఈనెల 8 నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నుంచి ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా మందిరాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 
 
ఏపీ ప్రభుత్వం ఆలయాలు, ప్రార్థనా సంస్థలు కంటైన్మెంట్ జోన్లలో ఉంటే మూసే ఉంచాలని స్పష్టం చేసింది. 65 ఏళ్లకు పైబడిన వయసువారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు ప్రార్థనాలయాలకు ఆలయాలకు వెళ్లకపోవడమే మంచిదని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నిబంధనలకు అనుగుణంగా ఆలయాలను పర్యవేక్షించే సంస్థలు భక్తులకు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. 
 
భక్తులు దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్నపుడు కనీసం ఆరడుగుల భౌతికదూరం తప్పకుండా పాటించాలని.... ఫేస్ కవర్స్ లేదా మాస్కులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించాలని.... దగ్గు, తమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతులను అడ్డు పెట్టుకోవాలని ... ఆలయ పరిసరప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని.... ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. 
 
దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేనివారినే దర్శనానికి అనుమతించాలని.... పార్కింగ్‌ ప్రదేశం లోపల, బయట ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదని... ఆలయంలో దేవతామూర్తులను, ఇతర ప్రార్థనా స్థలాల్లో పవిత్ర గ్రంథాలను తాకకూడదని.... ప్రార్థనాలయాల దగ్గర ప్రసాదాలు/ పవిత్ర జలాలను చల్లడం చేయరాదని.... సామూహిక వంటశాలలు, అన్నదానాల వద్ద భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. ప్రార్థనాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, నీటి కుళాయిలు, కాళ్లు కడుక్కునే ప్రాంతాలవద్ద ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: