రాజకీయాల్లో పార్టీ మార్పులు అనేవి సర్వ సాధారణమే. అయితే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ చేసేప్పుడు, అప్పటి వరకు ఉన్న పార్టీని, ఆ అధినేతని తెగ తిట్టేసి పార్టీ మారిపోతారు. గత ఐదేళ్ల కాలంలో అదే వ్యవహారం జరిగింది. వరుస పెట్టి వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళుతూ, జగన్‌ని ఇష్టమొచ్చినట్లు తిట్టేశారు. ఇక అలా తిట్టిన ఎమ్మెల్యేల పరిస్తితి 2019 ఎన్నికల్లో ఏమైందో తెలుసు.

 

ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో రావడంతో, టీడీపీ నేతలు వరుసపెట్టి చంద్రబాబుని తిట్టేసి జగన్‌కు జై కొడుతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడి టెక్నికల్‌గా పదవిపోకుండా వైసీపీకి మద్ధతు తెలిపారు. అయితే వీరిలో వల్లభనేని వంశీ మొదట్లో బాబుపై విమర్శలు చేశారు. కానీ తర్వాత పెద్దగా మాట్లాడటం లేదు. ఇక కరణం బలరాం అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

 

అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి మాత్రం, చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటున్నారు. తాజాగా కూడా జగన్‌ని పొగుడుతూ... 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అబద్దాలు చెప్పడం ఇంకా మానుకోవడం లేదని విమర్శించారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడటానికి రెడీగా ఉన్నారని కామెంట్ చేశారు. ప్రజలు మెచ్చే పాలన అందించామని చెప్పుకొనే చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యారు..? అని ప్రశ్నించారు.

 

అయితే మద్దాలి గిరి కామెంట్లపై తెలుగు తమ్ముళ్ళు సీరియస్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారతారని లేనిపోని ప్రచారం చేస్తున్నారని, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో పాటు టీడీపీ కూడా ఓడిపోయిందని, అదే టీడీపీలో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. 2014 ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ నుంచి ఓడిపోయినా సరే 2019 ఎన్నికల్లో వెస్ట్ సీటు ఇచ్చారని, అక్కడ టీడీపీకి బలం ఉండటంతోనే మద్దాలి గెలిచారని గుర్తుచేస్తున్నారు. వంశీలాగా మద్దాలికి పెద్దగా సొంత ఇమేజ్ ఏమి లేదని, కేవలం ఆయన టీడీపీ బలం, చంద్రబాబు ఇమేజ్‌తోనే గెలిచారని, అలా గెలిచిన మద్దాలి కూడా ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తమ్ముళ్ళు ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: