రాజకీయాల్లో నేతలు...తమ వారసులని పైకి తీసుకురావాలని తెగ కష్టపడుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉంటూ తమ వారసులకు పెత్తనం ఇస్తుంటారు. అయితే ఈ పెత్తనం వల్ల ఒకోసారి వారసులకు ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది దాన్ని కూడా సరిగా ఉపయోగించుకోకుండా తమ తండ్రుల పరువు తీయడమే కాకుండా పార్టీకి పెద్ద డ్యామేజ్ చేస్తుంటారు.

 

ఈ విధంగానే పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వారసుడు అప్పలనాయుడు వల్ల టీడీపీకి గట్టి దెబ్బే తగిలిందట. అయితే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బండారు అల్లుడన్న సంగతి తెలిసిందే. ఇక అప్పలనాయుడు రామ్మోహన్‌కు బామ్మర్ది అవుతాడు. ఇలా రెండు వైపులా పోలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ బాగా ఉన్నా సరే అప్పలనాయుడు మాత్రం, మంచి నాయకుడుగా ఎదగలేదని తెలుస్తోంది.

 

గత ఐదేళ్లు బండారు పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ అధికారాన్ని అప్పలనాయుడు బాగా వాడుకున్నారు. తండ్రిని మించిన కోపంతో, రాజకీయ తెలివి లేమితో అప్పలనాయుడు పార్టీని ముంచేశారు. తండ్రిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కొడుకు ప్రజలు భరించలేని అంతగా పెత్తనం చేశారు. స్నేహితులతో కలిసి పలు వివాదాల్లో చిక్కుకున్నారు.  దీంతో 2019 ఎన్నికల్లో బండారుని పెందుర్తి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన అదీప్ రాజ్‌ని మంచి మెజారిటీతో గెలిపించారు.

 

అయితే బండారు ఓటమి పాలై సంవత్సరం దాటింది. కానీ ఇంకా పెదుర్తిలో టీడీపీ పుంజుకోలేదు. ఇంకా అప్పలనాయుడు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో బండారుకు సన్ స్ట్రోక్ తగులుతూనే ఉంది. దీనికితోడు బండారు వయసు మీద పడుతుంది. పార్టీ మీద పట్టు కూడా కోల్పోతున్నారు. అలా అని వారసుడుని పెందుర్తి బరిలో నిలిపితే టీడీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని అక్కడి తెలుగు తమ్ముళ్లే అంటున్నారు. మొత్తానికైతే రామ్మోహన్ బామ్మర్ది పెందుర్తిలో టీడీపీకి గట్టి దెబ్బే వేసినట్లు కనబడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: