కరోనా నేపథ్యంలో టాలీవుడ్ సినిమాల షూటింగ్‌లన్నీ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్‌లో సడలింపులు రావడంతో మొన్న ఆ మధ్య తెలుగు చిత్రసీమలో కొందరు ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లని కలిసి పలు అంశాలు, సమస్యలపై చర్చించారు. అలాగే షూటిన్‌లకు అనుమతి ఇచ్చినందుకు కేసీఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక ఈ వ్యవహారమంతా చిరంజీవి తన భుజాల మీద వేసుకుని నడిపించారు.

 

ఈ క్రమంలోనే బాలయ్య సడన్ ఎంట్రీ ఇచ్చి, సీఎం, మంత్రితో భేటీలకు తనని ఎవరు పిలిచారని ప్రశ్నిస్తూ...అందరూ కలిసి మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి వెళ్ళారా అంటూ విమర్శలు చేశారు. ఇక బాలయ్య మాటలతో నాగబాబుతో పాటు ఇద్దరు, ముగ్గురు సినీ ప్రముఖులు విభేధించారు. అలాగే మరికొందరు బాలయ్యకు సపోర్ట్‌గా మాట్లాడారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే తాజాగా చిరంజీవి నాయకత్వంలో నడిచే సినీ బృందం ఈ నెల 9న ఏపీ సీఎం జగన్‌ని కలిసి, కృతజ్ఞతలు తెలుపుకుని, దీంతో పాటు నంది అవార్డుల ప్రధానం, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్సులు, స్టూడియోలను నిర్మించడానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడంలో రాయితీలను ఇవ్వాలని కోరే అవకాశముందని తెలుస్తోంది.

 

ఇక ఈ భేటీకి బాలయ్యకు ఆహ్వానం వెళ్ళగా, ఆయన రావడానికి కుదరదని నిర్మాత సి కల్యాణ్ చెప్పారు. ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు ఉందని, అందుకనే ఆయనకు రావడానికి కుదరట్లేదని కల్యాణ్ చెప్పారు. అయితే పుట్టినరోజు విషయం పక్కనబెడితే బాలయ్య రాకపోవడానికీ అసలు కారణం మాత్రం చిరంజీవి లీడ్ తీసుకోవడం ఒకటైతే, మరొకటి సీఎం జగన్ తన ప్రత్యర్ధి పార్టీ. కాబట్టి ఇందువల్లే బాలయ్య ఆ భేటీకి హాజరు కావడం లేదని తెలుస్తోంది.

 

కానీ ఇప్పుడు బాలయ్య.జగన్‌ని కలవకపోయినా భవిష్యత్‌లో కలిసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే 2014,2015,2016 సంవత్సరాలకు సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించింది. అయితే అవార్డుల ప్రధానం చేసే కార్యక్రమం జరగలేదు. జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూనుకుంటే, 2014లో లెజెండ్ సినిమాకు గాను బెస్ట్ హీరోగా ఎంపికైన బాలయ్య, జగన్ చేతులో మీదుగా నంది అవార్డు తీసుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: