జగన్ అంటేనే ముక్కుసూటి. ఆయన మాటంటే మాటే. ఆయన కత్తికి ఎదురులేదు. అనుకున్నది చేస్తారు. ఇదీ ఆయన గురించి బయట ప్రచారం జరిగేది. పార్టీ విపక్షంలో ఉన్నపుడు జగన్ ఓ విధంగా గట్టిగానే వ్యవహరించారు. ఆయన మీద కానీ పార్టీ మీద కానీ వ్యతిరేక వ్యాఖ్య చేస్తే ఇక ఇంటికి పంపించేసేవారు. అటువంటి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మిష్టర్ కూల్ అయిపోయారు.

 

దానికి కారణాలు చాలా ఉన్నాయి. జగన్ ఏం చేసినా ఇపుడు ప్రభుత్వాధినేతగా అయిదు కోట్ల మంది ప్రజలు మొత్తం పట్టించుకుంటారు. ఓ విధంగా పార్టీలో రచ్చ జరిగితే అది ప్రభుత్వం మీద కూడా పడుతుంది. దాంతో అసలే వ్యతిరేక మీడియా చుట్టూ ఉంది. దాన్ని చిలవలు పలవలు చేసి రాసేస్తుంది. అపుడు కోరి కంపు చేసుకున్నట్లు అవుతుంది.

 

ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం మీద కొంతమంది  వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను నిర్మాణాత్మకంగానే తీసుకుంటున్నారు. వారు చెప్పిన దాంట్లో సమస్య కనబడితే చాలు దాన్ని వెంటనే సాల్వ్ చేయమని కూడా అదేశిస్తున్నారు. నిజానికి ఏపీలో జగన్ని ఇసుక సమస్య ఒక్కలా వేధించడంలేదు. అధికారంలోకి వచ్చాక గత ఏడాదిగా ఇసుక సమస్య ప్రభుత్వానికి పెద్దదై కూర్చుంది.

 

ఇపుడు లాక్ డౌన్ తరువాత కూడా ఇసుక కొరత బాగా పట్టిపీడిస్తోంది. దాంతోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీన్ని ఫోకస్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అలాగే మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన గౌరవం దక్కడంలేదన్న అసంత్రుప్తి ఉంది. పైగా వారి నియోజకవర్గాల్లో పనులు సాగడంలేదు.

 

ఈ వివక్షను వైసీపీ హై కమాండ్ పరిశీలించాల్సి ఉంది. అదే విధంగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ఒకసారి కూర్చుని మాట్లాడితే సరిపోతుంది. కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా సీఎం పార్టీలో ఉన్న వారందరితో చర్చిస్తే బాగుంటుంది అన్నది కూడా గట్టిగా వినిపిస్తోంది.

 

 ఎటూ రెండవ ఏడాదిలోకి ప్రభుత్వం ప్రవేశించింది కాబట్టి ఎంతకాదనుకున్నా వ్యతిరేకత ఉంటుంది. అందువల్ల ముందు జాగ్రత్తగా పార్టీలోని  నేతలతో, ఎమ్మెల్యేలతో జగన్ తరచూ  మాట్లాడుతూ ఉంటే ఎవరూ బయట విమర్శలు చేసే అవకాశం ఉండదు అంటున్నారు. చూడాలి మరి. జగన్ ప్రస్తుతానికి కదులుతున్నారు ఆ దిశగానే.

మరింత సమాచారం తెలుసుకోండి: