కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో అమెరికా ముందంజలో ఉంది. రెండు మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసినట్లు ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలనానికి తెరతీశారు. పరీక్షలు పూర్తయితే..కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు యూఎస్ ప్రెసిడెంట్. 

 

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయటంలో అమెరికా వడివడిగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన సమావేశం ఇటీవలే వైట్ హౌస్ లో జరిగింది. ఈ విషయంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. రక్షణపరమైన తనిఖీలు పూర్తయితే, కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. చికిత్సా విధానంలోనూ మంచి పనితీరును కనబరుస్తున్నామని తెలిపారు. ఇటీవల ఇదే విషయంపై వైట్‌హౌస్‌ హెల్త్ అడ్వైజర్ ఆంథోని ఫౌచి మాట్లాడారు. 2021 ప్రారంభానికి కొన్ని మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు అమెరికా వద్ద ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న ఐదు కంపెనీలను ట్రంప్ ప్రభుత్వం ఎంపిక చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రకటించింది.  

 

మరోవైపు..అధికారులు వైరస్‌ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారని ట్రంప్‌ స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు మాత్రం వైరస్‌కు సంబంధించిన కీలక విషయాలు ఇంకా తెలుసుకోలేదని అమెరికా అధ్యక్షుడు చెప్పడం విశేషం. జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం..అమెరికాలో ఇప్పటి వరకు 18 లక్షల మందికి పైగా కరోనా సోకింది.1,08,120 మంది కరోనా కారణంగా మరణించారు. ఇలాంటి సమయంలో ట్రంప్ కరోనా వ్యాక్సిన్ పై ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. 

 

మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఓ శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ తో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో వ్యాక్సిన్ వస్తే తప్ప ఆ మహమ్మారి నుంచి బయటపడలేమని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆశలు చిగురెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: