కరోనాతో 29ఏళ్ల యువ జర్నలిస్టు మనోజ్ మరణించడం తెలంగాణలో సంచలనం సృష్టించింది. గత కొంత కాలంగా టీవి 5లో క్రైమ్ న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తున్న మనోజ్ కొద్దీ రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు అయితే తనకు కరోనా సోకిందని ఆలస్యంగా గుర్తించిన మనోజ్ తీవ్ర అస్వస్థతో గాంధీ ఆసుపత్రిలో చేరగా ఈరోజు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈవార్త మీడియా వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేసింది. 
 
ఇక మనోజ్ మరణం పై రాష్ట్ర వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. యువ జర్నలిస్ట్ మనోజ్ మృతి తీవ్ర మనోవేదన ను కలిగించింది. మనోజ్ ను బ్రతికించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయినా బ్రతికించుకోలేకపోయాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఈటల ట్వీట్ చేశారు. 
ఇదిలావుంటే ఈరోజు తెలంగాణ లో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 132 కేసులు గ్రేటర్ పరిధిలోనివే కాగా కరోనా తో ఈఒక్క రోజే 14మంది మృతి చెందడం గమనార్హం. ఈ మరణాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 154 కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: