ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ, ఎదుటి వారిపై పంచ్ డైలాగులు వేస్తూ విమర్శలు చేయడంలో ముందుంటారు సినీనటుడు మాటల రచయిత పోసాని కృష్ణ మురళి. వైసీపీకి మద్దతుదారుగా ఉంటూ ఆ పార్టీ తరఫున టీవీ డిబేట్ లలో పాల్గొంటూ ఆ పార్టీకి బలమైన వాయిస్ వినిపిస్తూ వస్తున్న పోసాని కృష్ణ మురళి కొద్దిరోజులుగా ఆ పార్టీకి కాస్త దూరం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నారు. చాలా కాలంగా ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించినా, జగన్ మాత్రం ఎందుకో తెలియదు కానీ పోసానికి ఆ పదవి కట్టబెట్టకుండా అలా వెయిటింగ్ లో పెట్టారు. 2 రోజుల క్రితం సినీ నటుడు బాలయ్య చిరంజీవి వివాదం పైన కూడా పోసాని స్పందించారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో పోసాని విరుచుకుపడ్డారు.

IHG


 మామూలుగానే పోసాని ప్రెస్ మీట్ అంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి మాట్లాడతారని అంతా అనుకున్నా, ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాలపై పోసాని మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు. దేశంలో ఏ నాయకుడు 50 లక్షలు ఇస్తూ పట్టుబడలేదని , ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డి కి మాత్రమే దక్కుతుందని పోసాని విమర్శించారు. అటువంటి రేవంత్ ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ హేళన చేశారు. కేటీఆర్ హరీష్ రావు  నిజాయితీపరులు అని, వారు అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. 

 


కేటీఆర్, హరీష్ రావు తెలంగాణకు రెండు కళ్లు వంటి వారని, ఆయన చెప్పుకొచ్చారు. కేటీఆర్ మంచి వక్త అని కెసిఆర్ నోటి నుంచి ఊడి పడినట్లుగా ఉంటాడని, కేటీఆర్ లంచాలు తీసుకోవాలని అనుకోరని, ఒకవేళ తీసుకున్నట్లుగా మీకు తెలిస్తే వచ్చి నన్ను చెంప మీద కొట్టండి అంటూ పోసాని ప్రెస్ మీట్ లో సవాల్ విసిరారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై ఆయన మాట్లాడారు. అది కెసిఆర్ కలల ప్రాజెక్ట్ అని, కాలేశ్వరం డ్యామ్ కమిషన్ కోసమే నిర్మించారు అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శన అని చెప్పుకొచ్చారు. అకస్మాత్తుగా ఏపీ రాజకీయాలు వదిలిపెట్టి తెలంగాణ రాజకీయాలపై పోసాని దృష్టిపెట్టడం, అదేపనిగా టిఆర్ఎస్ నాయకులు అందర్నీ పొగడడం వెనుక కారణం ఏంటో ఎవరికీ అంతు పట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: