దేశంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 10,000 కేసులకు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. అన్ లాక్ 1.0 లో భాగంగా నిన్నటినుంచి దేశవ్యాప్తంగా ప్రార్థనా ఆలయాలు, మసీదులు, చర్చ్ లు ఓపెన్ అయ్యాయి. 
 
ఆలయాల్లోకి పదేళ్లలోపు చిన్నారులను, 65 ఏళ్లు దాటిన వృద్ధులను అనుమతించరు. తీర్థప్రసాదాల వితరణ, శఠగోపం, అంతరాలయ దర్శనం, వసతి సౌకర్యం ఉండదు. గత 80 రోజులుగా మూతబడిన వ్యాపార కార్యకలాపాలను సంబంధించిన సంస్థలు నిన్నటినుండి తెరుచుకున్నాయి. అన్ లాక్ 1.0 లో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరవడంతో భారత్ లో బిజీబిజీగా మారుతుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. 
 
వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండగా వ్యాపార, వాణిజ్య సంస్థలకు అనుమతులు ఇవ్వడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో వైరస్ తో సహజీవనం చేయక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.6 లక్షలు దాటింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా సోకకుండా ఉంటుందని.... ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.  వైరస్ ఎప్పుడు... ఎక్కడ.... ఎవరికి సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బయటకు అత్యవసరమైతే మాత్రమే వెళ్లాలని... సబ్బు, శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: