భారత దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు... మనుషుల ప్రాణాలు పోతున్నాయి.  ఇక విద్యావ్యవస్థ కూడా ఇబ్బందుల్లో పడింది.  కరోనా ప్రబలి పోతుందని తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసందే. వాస్తవానికి 8 నుంచి పరీక్షలు జరపాల్సి ఉన్నా..  పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులు నేరుగా పైతరగతులకు ప్రమోట్ అయ్యారు.  ఇంటర్నల్‌ పరీక్షల ఆధారంగా విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జెక్టులకు గాను, 11 పేపర్లు ఉండగా.. వాటిలో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. అయితే.. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్‌ అసెస్మెంట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను పైతరగతికి ప్రమోట్‌ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

 

పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది.  తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: