తెలుగు సినిమా పెద్దలకు ఏపీ సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్ లో కేంద్రీకృతమైన సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలివచ్చేందుకు అనువుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ ఇప్పటికే తన రాజధానిగా విశాఖ పట్నాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే తెలుగు సినిమా పెద్దలు కూడా విశాఖలో తమకు భూములు కావాలని కోరారు. తమకు భూములు ఇస్తే.. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామన్నారు.

 

 

ఇందుకు జగన్ సర్కారు కూడా పూర్తి సానుకూలతతో ఉంది. షూటింగ్‌కు సంబంధించి విశాఖలో స్టూడియోలు నిర్మాణాలు చేసుకోవచ్చని, సినిమా పరిశ్రమల పెద్దలు ఇక్కడే ఉండాలనుకుంటే ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని సీఎం వారితో చెప్పారు. చిన్న సినిమాలకు ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రావాల్సిన సబ్సిడీ 2000 సంవత్సరం నుంచి రిలీజ్‌ కాలేదని సినీ పెద్దలు సీఎంతో చర్చించారు. ఈ విషయంపైనా సానుకూలంగా స్పందించిన జగన్ పాత విషయాలను కూడా పరిశీలించి నోట్‌ తయారు చేయాలని ఆదేశించారన్నారు.

 

 

మొత్తం మీద తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడుగా ఉంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సినీ పెద్దలకు మాటిచ్చారు. జూలై 15 తరువాత ఏపీలో కూడా షూటింగ్‌లు జరుపుకోవడానికి అనువైన విధానాన్ని రూపొందించి ఆర్డర్స్‌ పాస్‌ చేయాలని సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆలోచించి తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. కోవిడ్‌ టైమ్‌లో సినిమా థియేటర్లు తెరుచుకోలేదని, థియేటర్ల ఫిక్స్‌డ్‌ పవర్‌ చార్జీలు ఎత్తేయాలని సినీ ప్రముఖులు సీఎంను కోరారు.

 

 

ఈ విషయంపైనా సినీ పెద్దలు విజ్ఞప్తి మేరకు స్పందించిన సీఎం వైయస్‌ జగన్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019–20 సంవత్సరం నంది అవార్డులు ప్రకటించి అవార్డు ప్రధానోత్సవాలు చేసుకుందామని కూడా సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: