తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చేందుకు ఎస్సెస్సీ బోర్డ్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆ వెంటనే బోర్డ్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. రాష్ట్రంలో పరీక్షలు రద్దు కావడంతో అధికారులు ఆ తర్వాత ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. విద్యార్థులకు నాలుగు ఫార్మెటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. 
 
రాష్ట్రంలో జులై నెలలో జూనియర్ కాలేజీల ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయనుండటంతో విద్యార్థులకు వీలైనంత త్వరగా గ్రేడ్‌లకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీకి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ స్కూల్ యాజమాన్యాల సంఘం విద్యార్థులను ప్రమోట్ చేయడంతో పాటు గ్రేడ్ లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడింది. ఇంటర్నల్ మార్కుల ద్వారా ఇచ్చే గ్రేడింగ్ ల వల్ల భవిష్యత్తులో విద్యార్థులెవ్వరికీ నష్టం ఉండబోదని స్కూల్ యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు అభిప్రాయపడ్డారు. 
 
పరీక్షల రద్దు ప్రకటించక ముందే విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు విద్యాశాఖకు చేరాయని.... ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదని చెప్పారు. డీఈవోలు మార్కులు కలుపుతారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ వ్యాజ్యం దాఖలైంది. 
 
పరీక్షలు నిర్వహించడానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ రాష్ట్రంలోని బెలగావికి చెందిన రాజశ్రీ అనే మహిళ విద్యార్థులకు గతంలో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చి ఉత్తీర్ణులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రజల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడంతో సుప్రీం ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: