భారత వాతావరణ విభాగం రాష్ట్రంలో అల్ప పీడనం, రుతు పవనాల ప్రభావం వల్ల నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటన చేసింది. ఈరోజు, రేపు విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని ఇతర జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్ప పీడనంగా మారడంతో నైరుతి రుతు పవనాలు కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సమాచారం. రాయలసీమలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.... ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నిన్న గుంటూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 
 
జిల్లాలో పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్న ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. ఈరోజు, రేపు తీరం వెంట గంటకు 45 కిలో మీటర్ల నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని... మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే మంచిదని వాతావరణ శాఖ సూచిస్తోంది. గత 24 గంటల్లో విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 
 
విశాఖ 5 సెం.మీ, ఎస్. కోట, అరకు, అనకాపల్లి, వేపాడలో 4 సెం.మీ, భీమిలి, చోడవరం ప్రాంతాలలో 3 సెం.మీ వర్షం కురిసింది. ఎండలు తగ్గుముఖం పట్టి వర్షాలు పడుతూ ఉండటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కనికరించి విస్తారంగా వర్షాలు కురవాలని ప్రజలు ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: