ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వ్యాపార, వాణిజ్య సంస్థలపై ఆంక్షలు తొలగిపోయాయి. అన్ లాక్ 1.0లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు ఓపెన్ అయ్యాయి. దీంతో రోడ్లపైకి వచ్చే జనం సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
రాష్టంలో సడలింపులు అమలవుతూ ఉండటం వల్ల ప్రమాదకర స్థాయిలో వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో 200కు పైగా కేసులు నమోదవుతూ ఉండగా నిన్నటివరకు 5,247 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారి కేసులు, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 15,384 శాంపిల్స్ ను పరీక్షించారు. 
 
నిన్న నమోదైన కేసుల్లో 136 మంది స్థానికులు కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 26 మంది, విదేశాల నుంచి వచ్చిన 56 మంది కరోనా భారీన పడ్డారు. గడచిన 24 గంటల్లో కరోనా భారీన పడి ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 78కు చేరింది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
అన్ లాక్ 1.0లో ఇచ్చిన సడలింపుల వల్లే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రజల నిర్లక్ష్యం వల్లే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొందరు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల వారు కరోనా భారీన పడటంతో పాటు ఇతరులు కూడా కరోనా భారీన పడాల్సి వస్తోంది. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: