కేంద్రప్రభుత్వం ఇటీవల విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలు తీసుకురాబోతోంది. ఈ మేరకు కొత్త విద్యుత్ బిల్లు రూపొందిస్తోంది. వాస్తవానికి విద్యుత్ అనేది కేంద్రం, రాష్ట్రం ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కానీ.. ఈ కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతుంది. కేంద్రం పెత్తనం పెరుగుతుంది. అందుకే.. ఈ కొత్త బిల్లు అసలేం బాగాలేదు.. దీనికి మేం ఒప్పుకోం అంటూ జగన్ సర్కారు ఘాటుగానే కేంద్రానికి లేఖ రాసింది.

 

 

విద్యుత్ బిల్లు విషయంలో నిక్కచ్చిగా తన అభిప్రాయాలు కేంద్రానికి పంపింది. ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ పేరిట ఈ లేఖ కేంద్రానికి పంపింది. ఉమ్మడి అంశంగా ఉన్న విద్యుత్ ను కేంద్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది. అసలు ఇది రాజ్యాంగ స్పూర్తికి విఘాతమని ఘాటుగా బదులిచ్చింది. కొత్త చట్టం వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కోంటాయని ఏపీ ప్రభుత్వం తన లేఖలో పేర్కోంది.

 

 

విద్యుత్ సవరణ బిల్లు ప్రైవేటు ఉత్పత్తి దారులకు అవసరాన్ని మించి రక్షణ కల్పిస్తుందని లేఖలో స్పష్టం చేసింది. వినియోగదారుల కంటే విద్యుత్ ఉత్పత్తి దారులకే ఎక్కువ ప్రయోజనం కలిగేలా బిల్లు ఉందని వెల్లడించింది. దీని వల్ల కరెంటు కొనుగోలు రేటు పెరిగి వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని జగన్ సర్కారు వాదిస్తోంది. విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరగటం వల్ల పారిశ్రామిక వినియోగదారులకూ నష్టం కలుగుతుందని.. తద్వారా పారిశ్రామిక ప్రగతి ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని జగన్ సర్కారు అభిప్రాయపడింది.

 

 

అసలు దేశమంతా ఒకటే టారిఫ్ అనేది సాధ్యం కాదని.. మంచిది కాదని కేంద్రానికి జగన్ సర్కారు లేఖ రాసింది. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ నగదుగా ఖాతాల్లోకి వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఇది సామాజిక దుష్పరిణామాలకు దారితీస్తుందని జగన్ సర్కారు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేసింది. సబ్సీడీల అంశాన్ని రాష్ట్రాలకు విడిచి పెట్టాలని అందులో కేంద్రం వేలు పెట్టొద్దని ఘాటుగానే చెప్పేసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: