ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అవసరం అనుకుంటే కాళ్ళు పట్టుకోవడం... అవసరం లేదనుకుంటే కాళ్లు లాగడం రాజకీయాల్లో తరచుగా చోటుచేసుకునే విషయాలే. ఇక అసలు సంగతికి వచ్చేస్తే... ప్రస్తుతం టిడిపిలో వలసల భయం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గస్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇలా పెద్దఎత్తున అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ టిడిపిలో ఉన్న నాయకులు అందరిని చేర్చుకోవడమే కాకుండా, అతి తొందరలోనే తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దు అయ్యేలా చేయాలని చూస్తోంది. మరోవైపు తాను యాక్టివ్ గా ఏపీ లో పర్యటించి నాయకులకు భరోసా నింపుదామా అంటే కరోనా భయం పట్టుకుంది. ఇప్పుడు జనాల్లో తిరగడం అంత శ్రేయస్కరం కాకపోవడంతో చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు.


 ఈ క్రమంలో ఆయన ఇప్పటికీ కేంద్ర అధికార పార్టీ బిజేపితో పొత్తు పెట్టుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేస్తూనే వైసిపి బిజెపి తదితర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను గుర్తించి, వారిని మెల్లిగా టిడిపి వైపు తీసుకు రావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ రెండు పార్టీల నుంచి ఇంత అకస్మాత్తుగా నాయకులు వచ్చి చేరే అవకాశం లేకపోయినా, బాబు మాత్రం అసంతృప్తి నాయకులు చేరతారనే ఉద్దేశంలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ముందుగా తమ బంధు వర్గంలో ఉన్న ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

IHG


 అంటే అలా చేర్చుకోవాలనుకుంటున్న వారు  మరెవరో కాదు. కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నాయకులు దగ్గుబాటి పురంధరేశ్వరి. ఆమె మళ్ళీ టీడీపీ లోకి తీసుకువస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయంపై చంద్రబాబు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. టిడిపి భవిష్యత్తు దృష్ట్యా చూసుకున్నా, బలమైన నాయకులు లేకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆలోచించిన చంద్రబాబు  తానే ఒక మెట్టు దిగి పురంధరేశ్వరిని టిడిపి వైపు అడుగులు వేయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే పురంధరేశ్వరి టీడీపీ లోకి వచ్చే అవకాశమే లేదని, మరికొంతమంది బలంగా వాదిస్తున్నారు. 


గతంలో చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలో చేసిన అవమానం ఇప్పటికీ వారు మర్చిపోలేదని చెబుతున్నా, చంద్రబాబు మాత్రం ఆమెను టిడిపిలోకి తీసుకురావాలనే ఆలోచనతో తన కుమారుడు నారా లోకేష్ ను పురందరేశ్వరి ఇంటికి పంపించి ఆమెను ఒప్పించాలని చూస్తున్నారు. దీనికి అవసరమైతే తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ సహకారం కూడా తీసుకుని ఆమెను పార్టీలో యాక్టివ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: