తెలుగుదేశం హయాంలో ఈఎస్‌ఐ కుంభకోణానికి పాల్పడ్డారని అభియోగాలు ఎదుర్కొన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ను ఏపీ పోలీసులు అరెస్టు చేసారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అరెస్ట్‌ చేశారు. అక్కడ నుంచి ఆయన్ని విజయవాడకు తరలించారు. ఏపీలో జరిగిన ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 

 

ఈ ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడి అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు లభించినట్టు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. అచ్చెన్నాయుడు ఏపీలో కీలక నేత. తెలుగుదేశంలో ప్రధాన నాయకుడు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతల్లో అచ్చెన్నాయుడికి ప్రాధాన్యత ఉంది. అన్న ఎర్రన్నాయుడి మరణంతో అచ్చెన్నాయుడు కీలకంగా మారారు. అయితే అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్‌ఐ స్కామ్‌లో మొత్తం రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చెబుతోంది.

 

 

అసలు ఇంతకీ అచ్చెన్నాయుడు ఏం తప్పు చేశారంటారా..? చంద్రబాబు హయాంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. అచ్చెన్నాయుడి చొరవతోనే డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించారట. మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపించారు. తద్వారా ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు.

 

 

అంతే కాదు.. ఈఎస్‌ఐ స్కాంలో పాత్రదారులైన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు 85 కోట్లు చెల్లించారట. ఇప్పుడు ఈ అభియోగాలపై మరింత దర్యాప్తు సాగించేందుకు.. అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: