ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు కుడిభుజంగా ఉన్న అచ్చెన్నని ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో ఏపీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇలా ఊహించని విధంగా అచ్చెన్న అరెస్ట్‌తో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. జగన్ ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తూ.. అచ్చెన్నని అరెస్ట్ చేసారంటూ జగన్‌పై ఫైర్ అవుతున్నారు. అచ్చెన్నని ఏకంగా కిడ్నాప్ చేసేశారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.

 

అయితే స్కామ్ విషయం పక్కనబెడితే..అచ్చెన్న అరెస్ట్ వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. గత ఐదేళ్లు తనని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ చేసిన అక్రమాలని వెలికితీసే పనిలో ఉన్నారు. అలాగే గతంలో తనని విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకుని ఇబ్బందిపెడితే...ఇటీవల చంద్రబాబుని కూడా ఎయిర్‌పోర్టులో వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.

 

ఇక గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్న...జగన్‌పై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసేవారు. మాటకు మెదిలితే లక్ష కోట్లు అవినీతి అంటూ ఆరోపణలు చేసేవారు. అసెంబ్లీలో సైతం జగన్‌ని విమర్శిస్తూ...దారుణంగా అవమానించేవారు. సీబీఐ కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చారని, 43 వేల కోట్లు మింగేశారని మాట్లాడేవారు. అయితే దీనికి జగన్ కూడా ప్రతి స్పందించి...అవినీతి చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని, లేదంటే అచ్చెన్న రాజీనామా చేయాలని సవాల్ కూడా విసిరారు.

 

అలాగే నోటు కేసులో కీలకమైన ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ జగన్ బంధువని, జగన్ టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాలు లీక్ చేశారని అచ్చెన్న ఇష్టారాజ్యంగా జగన్‌పై విమర్శలు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే జగన్ మీద విమర్శలు చేసే అచ్చెన్న హైలైట్ అయ్యారు. అలా అప్పుడు తనపై ఒంటికాలి మీద లేచిన అచ్చెన్నకు జగన్ ఈ‌ఎస్‌ఐ స్కామ్ ద్వారా చెక్ పెట్టారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: