రైతు దేశానికి వెన్నుముక లాంటి వాడు. రైతులకు వ్యవసాయ రంగంలో తన వంతు సాయంగా మెళుకువలు తెలియజేస్తూ రైతులకు అండగా నిలిచాడు. నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచి నిరంతరం పని చేయడంలోనే సాంత్వన పొందిన అన్నదాత మాజీ సంపాదకుడు డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు (93) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

 

 

వివరాల్లోకి వెళ్తే... కృష్ణా జిల్లా వీరులపాడులో 1927 ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు నారాయణరావు జన్మించారు. ఆయన నందిగామ, గుంటూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. 1952లో మద్రాసు వెటర్నరీ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. కొలంబోప్లాన్‌ కింద 1960లో పశుపోషణలో అధ్యయనం కోసం భారత ప్రభుత్వం ఆయన్ను ఆస్ట్రేలియా పంపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్థక శాఖలో వివిధ స్థాయిల్లో పని చేశారు. పనిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలనే లక్ష్యంతో విశ్రాంత జీవితంలోనూ రైతు సేవలో తరించాలని భావించి 1985 నుంచి ఈనాడు గ్రూపులో చేరారు.

 

 

దేశంలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న వ్యవసాయదారుల మాసపత్రిక  అన్నదాత సంపాదకులుగా 1987 నుంచి 2017 అక్టోబరు వరకు మూడు దశాబ్దాల పాటు అపారమైన సేవలు అందించారు. వీరు నిర్వహించిన కార్యక్రమాల ఫలితంగానే భారత దేశంలో ఘనీభవించిన వీర్య ఉత్పత్తి, వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్నారు. పశుసంవర్థక రంగంలో తన అనుభవాల ఆధారంగా దూడల పెంపకంపై పుస్తకం రచించారు. ఆయన ఈనాడు అన్నదాత పత్రికల్లో వందలాది వ్యాసాలు రాశారు.

 

 

అయన కృషిని గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థలు అవార్డులు ప్రదానం చేశారు. రైతుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1994లో ప్రతిష్టాత్మక డాక్టర్‌ నాయుడమ్మ అవార్డు, డా.సికే.రావు ట్రస్టు పురస్కారం, డా.రఘోత్తమరెడ్డి అవార్డు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. రైతు సేవలో విరామమెరుగని నిత్యకృషీవలుడిగా, రైతు బాంధవుడిగా అన్నదాతల మనసులను గెలుచుకున్న డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు అకాలమరణం పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: