ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య రాజకీయ పోరు తార స్థాయికి చేరుకుంది. తాజాగా ఏపీలో అచ్చెన్నాయుడు అరెస్ట్ తో అక్కడి టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయం పైన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడారు. కోర్టులు ఇన్ని సార్లు మొట్టికాయులు వేయడం చరిత్రలో ఇదే తొలిసారి అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.

 

 

కోర్టులలో ఇన్ని వ్యతిరేక తీర్పులు వచ్చినందుకు సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు. ఇళ్ళ స్థలాలు భూసేకరణ పేరుతో దోపిడికి పాల్పడ్డారని విమర్శించారు. మద్యం, ఇసుక పేరుతో దోపిడికి పాల్పడ్డారన్నారు. ఈ అంశాలన్నీ దృష్టి మరల్చేందుకే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారన్నారు. కేబినెట్‌లో కొండను తవ్వి ఎలుక తోక మీద ఈక పట్టుకున్నారని నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు.

 

 

తెల్లారేసరికి ఓ బందిపోటు దొంగ మాదిరిగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బీసీలలో బలమైన నాయకుడు అచ్చెన్నాయుడు అని తెలిపారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు పరాకాష్ట అచ్చెన్నాయుడి అరెస్టు అనిపేర్కొన్నారు. కేంద్రం నిబంధనల ప్రకారమే ఈఎస్ఐ వైద్య పరికరాలు కొనుగోలు చేస్తోందన్నారు. నిన్నటి వరకు దళితులపై దాడి.. నేడు బీసీలపై దాడులు ప్రారంభించారన్నారు. ప్రజలు వైసీపీ పాలనపై తిరగబడే రోజులు వచ్చాయన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు లేకపోతే రాష్ట్రంలో ప్రజలు మీ అంతు చూసేవారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.

 

 

ప్రజల మద్దతున్న నాయకుడిపై కక్ష సాధిస్తున్నారని చెప్పారు. బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని అడిగారు. ప్రతి రాష్ట్రం కంటే తక్కువ ధరతో ఏపీలో గతంలో మందులు కొనుగోలు చేశామని వివరించారు. సెక్షన్ అధికారి నుంచి ఒక్కొక్కరిని విచారిస్తూ చర్యలు తీసుకోవాలని, అంతేగానీ, ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏంటని అన్నారు. ఇచ్చిన హామీల్లో వైసీపీ నేతలు ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. నవరత్నాలు అంటూ ప్రజలకు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: