ఏపిలో ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా పాలన కొనసాగిస్తున్నారని.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులే అని విజిలెన్స్ అధికారుల విచారణ మేరకే టీడీపీ నేత అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.  అంత మాత్రాన స్వాతంత్రం కోసం పోరాడిన ఓ మహాయోధున్ని అరెస్ట్ చేసినట్లు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు అంటూ ఫైర్ అయ్యారు. మరీ దారుణంగా ఆయనను కిడ్నాప్ చేశారని అంటున్నారని మండిపడ్డారు.  ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా తెలియకుండా అచ్చెన్నాయుడు వ్యవహారం నడిపారని, పలానా కంపెనీతో ఎంఓయూ  చేసుకోవాలంటూ లెటర్ హెడ్ మీద సంతకాలు కూడా చేశారని చెప్పారు.

 

రూ. 150 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా రుజువైందని అన్నారు. ప్రజలకు ఎంతో గౌరవంగా ఎన్నుకొన్న ఓ ప్రజా ప్రతినిధి చేసే పనులేనా అంటూ ప్రశ్నించారు. అయితే గత కొంత కాలంగా టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాతున్నారని.. ఏడాది పాలనలో అధికార పార్టీ ఏం చేశారని  నారా లోకేశ్ తొడ కొట్టారని... ఇప్పుడు స్టార్ట్ అయిందని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ కూడా కటకటాల వెనక్కి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

 

తప్పు చేసిన ఎవరినీ సీఎం జగన్ వదిలి పెట్టరని.. అది తమ పార్టీ నేతలైనా ఏ పార్టీ నేతలపైన చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ కు, జగన్ కు సంబంధం లేదని... తప్పు చేశారని తేలడంతోనే ఏసీబీ అరెస్ట్ చేసిందని చెప్పారు. అచ్చెన్నాయుడు వంటి అవినీతి తిమింగలాలు జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: