అసలే కరోనా కాలం. మొన్నటి వరకూ ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌. రాకపోకలు అన్నీ బంద్‌. పెట్రోల్‌, డీజిల్ వినియోగం అమాంతం పడిపోయింది. పెట్రో నిల్వలు పెరిగాయి. ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి. మనకు కూడా ధరలు తగ్గాలి. కానీ ఇక్కడ మాత్రం రివర్స్‌. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా... కేంద్రం మాత్రం సుంకాన్ని పెంచుతూ పోతోంది. ఫలింతంగా వినియోగదారులకు ఆ లాభం అందడం లేదు.

 

దేశంలో వరుసగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగాయి. మార్చి 16 నుంచి.. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని నిలిపివేసిన ఆయిల్‌ సంస్థలు... మళ్లీ బాదుడు షురూ చేశాయి. ఆదివారం నుంచి పెంచుతూ పోతున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోలు ధర గత నాలుగు రోజుల్లో 2 రుపాయల85 పైసలు పెరిగింది. మరో వారంలో 5 నుంచి 6 రుపాయలు పెరిగే అవకాశం ఉందని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెబుతోంది. సెప్టెంబరు నెలాఖరుకు నాటికి పెట్రో ధరలు 85కు చేరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

 

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ఇంధన వాడకం పెరిగింది. దేశవ్యాప్తంగా వాహనాల రాకపోకలు గణనీయంగానే పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీంతో క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. డైనమిక్‌ ప్రైసింగ్‌ ప్రకారం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గితే మనకు కూడా తగ్గాలి. కానీ, వినియోగదారులకు ఆ లాభం అందకుండా కేంద్రం ఎప్పటికప్పుడు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది మార్చి 14న లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ పెంచింది. లాక్‌డౌన్‌ దెబ్బకు చమురు అమ్మకాలు పడిపోవడంతో.. ఆదాయాన్ని పెంచుకునేందుకు మళ్లీ మే మొదటివారంలో పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 మేర సుంకాన్ని పెంచింది. దీని ద్వారా కేంద్రానికి అదనంగా రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.  

 

గత నెల 6న ఎక్సైజ్‌ డ్యూటీ పెంపుతో ఢిల్లీలో పెట్రోలు ధర రూ.71.26దాటింది. అందులో పెట్రోలు అసలు ధరెంతో తెలుసా? కేవలం రూ.18.28 మాత్రమే. ఎక్సైజ్‌ డ్యూటీ 32.98 రుపాయలుండగా, డీలర్‌ కమీషన్‌ 3.56రుపాయలు, వ్యాట్‌ 16.44 రుపాయలు కలిపితే మొత్తం 71.26 రుపాయలకు చేరింది. ఈ లెక్కన ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై ఏస్థాయిలో బాదుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని నిజాయతీగా అమలు చేసి అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర తగ్గినప్పుడల్లా ఆ లాభాన్ని ప్రజలకు బదలాయిస్తే.. పెట్రో ధరలు కనీసం ఇప్పుడున్న ధరల కన్నా రూ.30 వరకు తక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

 

ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలూ పెరగనున్నాయి. జూన్‌ 1న 11.50 రుపాయల మేర పెరిగింది. మున్ముందు గ్యాస్‌ ధరలు ఇంకా పెరగనున్నాయని నిపుణుల అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: