మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టుపై రాజ‌కీయ ర‌గ‌డ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వివిధ పార్టీలు త‌మ అభిప్రాయాల‌ను ఈ విష‌యంలో వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే, తాజాగా తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ విలేక‌రుల స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తించాయి. గత ప్రభుత్వంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో రూ.150 కోట్ల అవినీతి బయటపడిందని అన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇటువంటి పరిణామాలే ఎదురవుతాయని బొత్స అన్నారు.

 

అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత చంద్రబాబు, టిడిపి నేతల స్పందన విడ్డూరంగా ఉంద‌ని బొత్స మండిప‌డ్డారు. ``అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని చంద్రబాబు అంటున్నారు. ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులతో అచ్చెన్నాయుడు సాధారణ స్థితిలోనే వెళ్ళిన దృశ్యాలను రాష్ట్ర ప్రజలు చూశారు. దానిని కిడ్నాప్ అని చంద్రబాబు ఎలా అంటున్నాడు? పైగా ఈ అవినీతి వ్యవహారాన్ని బిసి కులంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.` అంటూ మండిప‌డ్డారు.

 

అచ్చెన్నాయుడి అరెస్ట్ విషయంలో ఆయన ఎటువంటి అవినీతి చేయలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడని బొత్స ప్ర‌శ్నించారు. ``చంద్రబాబు తాను సీఎంగా వున్నప్పుడు ఎటువంటి కుంబకోణం జరగలేదని ఎందుకు చెప్పలేకపోతున్నాడు?- మేం ఎక్కడైనా అవినీతి చేశామా? చూపించడం? దమ్ముంటే నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ విచారణలో ఆయన హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. చంద్రన్న కానుకలు, ఎయిర్ పోర్ట్ లపై జరిగిన ఒప్పందాల అవినీతిపై  కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. వాటిపై సిబిఐ విచారణను ప్రభుత్వం కోరుతోంది.`అని తెలిపారు. 

 

`అచ్చెన్నాయుడి అరెస్టుతో బలహీనవర్గాలపై దాడి అని చంద్రబాబు ఆరోపిస్తున్నాడు. నేను కూడా అదే ప్రాంతం నుంచి వచ్చిన  బలహీనవర్గాలకు చెందిన వాడినే. వోక్స్ వ్యాగన్ పేరుతో ఆనాడు చంద్రబాబు నాపైన ఎన్ని నిందలు వేశాడు? అప్పుడు ఒక బిసి నాయకుడిపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నాననే బాధ చంద్రబాబుకు ఎందుకు కలగలేదు? చివరికి సిబిఐ విచారణలో నాపైన క్లీన్ చీట్ వచ్చింది. చంద్రబాబుకు, తన పార్టీకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటే మాత్రం బలహీనవర్గాలపై దాడి అంటాడు.``అంటూ చంద్ర‌బాబు టీం ఊహించ‌ని ప్ర‌శ్న వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: