రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తెలంగాణ రాజకీ‌యాల్లో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు. కొడంగల్‌ నియోజకవర్గం ఆయ‌న ఇలాకాగా ఉండేది. అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్క‌డే ఆయ‌న ఓడిపోయారు. ఈ మేర‌కు టీఆర్ఎ‌స్ త‌న పంతం నెగ్గించుకుంది. తాజాగా అక్క‌డ త‌న ప‌ట్టు పెంచుకునేందుకు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు   సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట్‌ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా కొడంగ‌ల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

 

 

కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు అపార నమ్మకంతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని, వారి ఆకాంక్షలు నెరవేరుస్తామని కేటీఆర్‌ తెలిపారు. నియోజకవర్గ భవిష్యత్‌ అవసరాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్‌ సూచించారు. ``ప్రజల ఆకాంక్షల మేరకు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం.  నియోజకవర్గంలో అవసరమైన చోట్ల సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌ శాఖ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న పనులు వేగంగా జరగాలి`` అని కేటీఆర్ కోరారు.

 

 

కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఫాంహౌజ్‌ వివాదంలో మంత్రి కేటీఆర్‌, ఎంపీ రేవంత్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గండిపేటలోని జన్వాడ గ్రామ పరిధిలో ప్రైవేట్‌ వ్యక్తి ఐదేళ్ల‌ క్రితం నిర్మించుకొన్న ఫాంహౌజ్‌పై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి  జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై స్పందిస్తూ విచార‌ణ‌కు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.  ఎన్జీటీ మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్పందించింది. ఫాంహౌజ్‌ తనది కాదని, దానితో ఎలాంటి సం బంధం లేదని మంత్రి కేటీఆర్‌ పిటిషన్‌ వేశారు. తనను పార్టీ చేయకుండా ఎన్జీటీ ఆదేశాలివ్వడాన్ని సవాల్ ‌చేస్తూ ఫాంహౌజ్‌ యజమాని బద్వేలు ప్రదీప్‌రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. ఈ రెండు పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఏ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పీ నవీన్‌రావు ధర్మాసనం ఎన్జీటీ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: