తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనేక ప్రాజెక్టుల్లో హ‌రితహారం ఒక‌టి. ప‌చ్చ‌ద‌నం పెంపొందించేందుకు తెలంగాణ  : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని ఈ ఏడాది సైతం కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలంలో యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. అర్బన్‌ ఫారెస్ట్‌లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడవుల పునరుజ్జీవంతోపాటు ఆక్రమణల నుంచి కాపాడాలని సీఎస్‌ సూచించారు. రాష్ట్రంలో 129 చోట్ల 188 ఫారెస్ట్‌ బ్లాకుల్లో 1.60 లక్షల ఎకరాల్లో అభివృద్ధి చేయాలని వెల్లడించారు. హైదరాబాద్‌లో వీలున్న ప్రతిచోట మొక్కలు నాటాలని తెలిపారు. మొట్రో కారిడార్‌లో ఇరువైపులా, మెట్రో డిపోల వద్ద మొక్కలు నాటాలని చెప్పారు.

 

కాగా, హ‌రిత‌హారాన్ని విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో జోన్‌కు లక్ష చొప్పున మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిని అమలు చేసేందుకు కూకట్‌పల్లి జోన్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  కార్యాలయాలల్లోని ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన స్థలాలు, కాలనీలలోని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.

 

మ‌రోవైపు ఈ ద‌ఫా హ‌రిత‌హారంలో ఇంకో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. జ‌పాన్‌ తరహాలో మియావాకీ ప్లానిటేషన్ చేయ‌నున్నారు. దీనికి కార‌ణం. జ‌నాభాకు అనుగుణంగా కాలనీలు, బస్తీల్లో మొక్కలు నాటేందుకు స్థలాలు అందుబాటులో లేకుండా పోయాయి. అందుకే జపాన్‌ తరహాలో మియావాకీ విధానాన్ని అవలంభించాలని, తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటాలని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. మియావాకీ విధానంలో వీలైనన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటుగా ఈ ఏడాది హరితహారంలో ఎదిగిన (పెద్ద) మొక్కలనే నాటాలని నిర్ణయించుకున్నారు. అలాగే స్థానిక పరిస్థితులను ఎదుర్కొని తట్టుకుని నిలబడే మొక్కలకే ఈ  ఏడాది హరితహారంలో ప్రాధాన్యతనివ్వనున్నారు. స్థానిక జాతుల మొక్కలను పెంచడం వల్ల తొందరగా ఎదుగుదల ఉంటుందని, ఈదురు గాలులు వచ్చినా.. నీరు లేకున్నా అవి పెరిగి పెద్దవుతాయని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: