‘అవినీతిని అంతం చేస్తా’ జగన్ అధికారంలోకి రాకమునుపు...వచ్చాక జగన్ పదే పదే చెప్పిన మాట. తన ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని చెబుతూనే, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టడమే లక్ష్యంగా జగన్ ముందుకెళ్లారు. ఓ వైపు ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడుపుతూనే, మరోవైపు గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఫోకస్ చేస్తూ, వాటిని వెలికితీయడమే పనిగా పెట్టుకుని వస్తున్నారు.

 

ఈ క్రమంలోనే అమరావతి భూములు, బాబు ప్రవేశ పెట్టిన పథకాల్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ఇంకా విద్యుత్ కొనుగోళ్ళు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లాంటి అంశాలపై కూడా ఫోకస్ పెట్టి అక్రమాలకు చెక్ పెట్టారు. అలాగే ఈ‌ఎస్‌ఐ స్కామ్‌ కూడా తెరపైకి రాగా, దానిపై ఎప్పటి నుంచో విచారణ చేయిస్తున్నారు. ఇక ఈ స్కామ్‌లో గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో, ఏసీబీ ఆయన్ని తాజాగా అరెస్ట్ చేసింది.

 

ఇక అచ్చెన్నని అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతూ...విమర్శలు చేస్తున్నాయి. అటు ఈ విమర్శలకు వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే అచ్చెన్న అరెస్ట్ వెనుక ఈ‌ఎస్‌ఐ స్కామ్ ఒకటే కారణం కాదని, రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో అచ్చెన్న మంత్రిగా ఉన్నప్పుడూ జగన్‌పై ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేసేవారు. ప్రతిదానికి జైలుకు వెళ్లారని అవమానించేవారు.

 

ఇక ముఖ్యంగా అప్పటిలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ జగన్ బంధువని, జగన్ ఇచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగానే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, కేసీఆర్ జగన్‌ల మధ్య హాట్‌లైన్ సంబంధం ఉందంటూ అచ్చెన్న అసెంబ్లీలో ఇష్టారాజ్యంగా విమర్శలు చేశారు. ఇక అచ్చెన్న మాటలకు అప్పుడే జగన్ తీవ్ర ఆవేశంతో ఊగిపోతూ... నిరూపించమంటూ సవాల్ కూడా చేశారు. అలా జగన్‌పై అచ్చెన్న ఘాటు విమర్శలు చేయడంతోనే..నేడు అచ్చెన్న ఉచ్చులో చిక్కుకున్నారని తెలుస్తోంది. మొత్తానికైతే జగన్ ఆవేశం అచ్చెన్న కొంపముంచినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: