ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా వేడెక్కాయి. నిన్నటికి నిన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్టు చేసింది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసింది. అంతేనా.. ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెబుతున్నారు. అంటే ఇక టీడీపీకి కష్టకాలం వచ్చినట్టే.. అయితే చంద్రబాబు హయాంలోనే ఓ చట్టం చేసి ఉంటే.. ఇప్పుడు ఈ బాధలు తప్పేవంటున్నారు వైసీపీ నాయకులు.

 

 

ఇంతకీ ఆ చట్టం ఏంటంటారా.. అవినీతిపరులను, అక్రమార్కులను అరెస్టు చేయకూడదని.. జైల్లో పెట్టకూడదని చంద్రబాబు తన కాలంలో చట్టం తెచ్చి ఉంటే.. ఇప్పుడు ఈ అరెస్టులు తప్పేవంటూ వెటకారంగా సెటైర్లు వేస్తున్నారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి. టీడీపీ నేతల అరెస్టులపై చంద్రబాబు అండ్ బ్యాచ్ చేస్తున్న విమర్శలపై శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.

 

 

తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని, తన వంతు, తన కుమారుడి వంతు వస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో అటెండర్‌ నుంచి మంత్రి వరకు అంతా అవినీతిమయమే.. ప్రజల సొమ్ము ఎవరు తిన్నా కక్కిస్తామన్నారు. అవినీతికి కులం, అధికారం ఉంటుందా..? పందికొక్కుల్లా ఎంత తిన్నా వదిలేయాలా..? అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.

 

 

కార్మికుల పొట్టగొట్టిన అక్రమార్కుడు అచ్చెన్నాయుడిని నిన్న అరెస్టు చేశారని, ఈరోజు అభినవ యముడి లాంటి జేసీ సోదరుల్లో ఒకరైన జేసీ ప్రభాకర్‌ను అరెస్టు చేస్తే చంద్రబాబుకు ఏడుపెందుకొస్తుందో అర్థం కావడం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతి పరులు, అక్రమార్కులను అరెస్టు చేయొద్దని చట్టం ఏమైనా ఉందా చంద్రబాబూ..? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తే ఎందుకింత బాధ అని నిలదీశారు. ఈ దేశంలోనే అధికంగా దోపిడీకి పాల్పడిన నాయకుడు చంద్రబాబేనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: