దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు కరోనా పేరు వింటే గజగజా వణికిపోతున్నారు. గడచిన 24 గంటల్లో దేశంలో 12,000 కొత్త కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 9,000 దాటింది. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,20,922కు చేరగా 1,62,379 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
కేంద్రం మార్చి 25వ తేదీన కరోనా వైరస్ విజృంభణ వల్ల లాక్ డౌన్ ను ప్రకటించింది. రెండో విడత లాక్ డౌన్ వరకు దేశంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలయ్యాయి. మూడో విడత లాక్ డౌన్ నుంచి సడలింపులు అమలు చేసిన కేంద్రం ఐదో విడత లాక్ డౌన్ కు వచ్చేసరికి థియేటర్లు, జనం గుంపులుగా ఏర్పడే కార్యక్రమాలు మినహా మిగిలిన వాటికి అనుమతులు ఇచ్చింది. దీంతో రోడ్లపైకి వచ్చే ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. 
 
దీంతో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఐదో విడత లాక్ డౌన్ సడలింపులకు ముందు 6000కు అటూఇటుగా నమోదైన కేసులు ప్రస్తుతం 12,000కు అటూఇటుగా నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మరోసారి కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు లాక్ డౌన్ అంటే భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోయామని... మరోసారి లాక్ డౌన్ అమలైతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు చెబుతున్నారు. 
 
అయితే కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశాలు లేవని.... కేసుల సంఖ్య మరింత పెరిగితే నిబంధనలు కఠినతరం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటం వల్ల దేశంలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరోసారి లాక్ డౌన్ ను కేంద్రం ప్రకటిస్తే ప్రజలు తిరగబడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16, 17 తేదీలలో మోదీ సీఎంలతో సమావేశం అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: