ఈ కాలంలో మనుషుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి.. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు.. ఒక వైపు కరోనా కాటువేస్తుండగా, మరో వైపు పోంచి వున్న ప్రమాదాలు మనిషి ప్రాణాలను హరిస్తున్నాయి.. ఈ ఘటనలు మనుషుల నిర్లక్ష్యం వల్లనే ఎక్కువగా జరుగుతున్నాయి..

 

 

ఇకపోతే కడప జిల్లా రాయచోటి పట్టణం జాతీయ రహదారిలో జరిగిన గోర రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మరణించిన హృదయ విదారక సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు పట్టణం వెంకట్రావుపల్లికి చెందిన గుండల లక్ష్మీ (48).. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ మెస్‌ నడుపుతున్న తన కుమారుడు కార్తిక్‌రెడ్డి (28) ని చూద్దామని బెంగళూరు వెళ్లగా అప్పుడే విధించిన లాక్‌డౌన్‌ వల్ల తిరిగి ఏపీకి రాలేక పోయింది..

 

 

ఇక ప్రస్తుతం సడలింపు ఇవ్వడంతో లక్ష్మీ కుమారుడు తన స్నేహితుడు సందీప్ ‌(30)తో కలసి తన తల్లిని ఆత్మకూరులోని సొంత ఇంటికి కారులో తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా రాయచోటి పట్టణం జాతీయ రహదారిలోని డాబా వద్ద ఎదురుగా ఆగి ఉన్న ఐషర్‌ వాహనాన్ని కారు ఢీకొంది.

 

 

ప్రమాదంలో కారు నడుపుతున్న కార్తిక్‌రెడ్డి, లక్ష్మీ, సందీప్‌ తీవ్రంగా గాయపడి కారులోనే  ఇరుక్కుపోగా, క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు అతికష్టం మీద బయటకు తీసుకొచ్చి వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కార్తీక్‌రెడ్డి మృతి చెందగా, చికిత్స పొందుతూ అతని తల్లి లక్ష్మీ కూడా మృతి చెందారు. సందీప్‌ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాసుపత్రికి తరలించారు.

 

 

ఇకపోతే పట్టణ సీఐ జి.రాజు మాట్లాడుతూ మృతదేహాలకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: