రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవాల‌ని తీవ్రంగా య‌త్నిస్తున్న భూమా బ్రహ్మానంద‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ అధిష్ఠానం నుంచి స‌రైన స‌హ‌కారం అంద‌క‌పోవ‌డంతోనే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 2017 ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మాజీ ఎమ్మెల్యే యువ‌కుడు భూమా బ్రహ్మానంద‌రెడ్డి.. తెర‌వెనుక త‌న దారి తాను చూసుకుంటున్నారని ప్రచారం జ‌రుగుతోంది. నంద్యాల ఉప పోరులో ద‌గ్గరుండి.. వ‌రుస‌కు అన్న అయిన బ్రహ్మానంద‌రెడ్డికి మాజీ మంత్రి, నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ గెలిచేలా చేశారు. ఆ ఉప ఎన్నిక‌ను అప్పట్లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు రెండు కూడా ఎంతో ప్ర‌తిష్ఠ‌గా తీసుకున్నాయి. 


అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం టికెట్ విష‌యంలో బ్ర‌హ్మానంద‌రెడ్డికి  అఖిల‌ప్రియ స‌హాయ నిరాక‌ర‌ణ చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. భూమా బ్రహ్మానంద‌రెడ్డికి టికెట్ ఇచ్చే విష‌యంలో అఖిల ప్రియ మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా  మౌనం వ‌హించ‌డం అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. ఆమె మ‌న‌సులో త‌న సొంత సోద‌రుడు  జ‌గ‌ద్విఖ్యాత్‌రెడ్డికి ఇవ్వాల‌ని భావించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది. అయితే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి మాత్రం టికెట్ కోసం గ‌ట్టి ప‌ట్టుబ‌ట్టారు. అవ‌స‌ర‌మైతే చంద్ర‌బాబు ఫొటోతోనైనా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. చివ‌రికి చంద్ర‌బాబు ఆయ‌న‌కే టికెట్ కేటాయించినా రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాన్‌గాలిలోనూ తాను కూడా అంద‌రి మాదిరిగానే ఓడిపోయారు. త‌న ఓట‌మికి వెనుక అఖిల ప్రియ మంత్రాంగం ఉంద‌ని బ్ర‌హ్మానంద‌రెడ్డి కూడా విశ్వ‌సిస్తున్నట్లు  ప్రచారం జ‌రిగింది. 


 వాస్త‌వానికి మొద‌టి నుంచి కూడా అఖిల ప్రియ నంద్యాల‌-ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ కుటుంబమే రాజ‌కీయంగా తిరుగులేకుండా ఉండాల‌ని కోరుకుంటున్నారు. అందుకే వ‌చ్చే 2024 నాటికి త‌న సొంత సోద‌రుడు జ‌గ‌ద్విఖ్యాత్‌రెడ్డిని రంగం లోకి దింపాల‌ని యోచిస్తున్నార‌ట‌. అలా చేస్తే  భూమా బ్రహ్మానంద‌రెడ్డి రాజ‌కీయ ప్ర‌యాణానికి ఇబ్బందులు ఎదుర‌య్యే ప‌రిస్థితి ఉంది. అన్ని ఆలోచించుకునే ఇటీవ‌ల ఆయ‌న  జిల్లా ఇంచార్జ్ మంత్రి, వైసీపీ నేత‌తో భూమా బ్రహ్మానంద‌రెడ్డి.. ఫోన్ చ‌ర్చలు చేసిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. పైగా బ్రహ్మానంద‌రెడ్డి మామ బ‌న‌గాన‌ప‌ల్లి ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి  ఫ్యామిలీ నుంచి కూడా పార్టీ మారాల‌న్న ఒత్తిడి..పెరుగుతోందంట‌. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ఆయ‌న పార్టీ మార‌డం అతి తొంద‌ర‌లోనే జ‌రుగుతుంద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: