సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకోవడం ముకేష్ అంబానీకి వెన్నతో పెట్టిన విద్య. కరోనా సమయంలో వ్యాపారాలు ముందుకు సాగక బడా కంపెనీలే చేతులెత్తేస్తుంటే...రిలయన్స్ జియో మాత్రం హాట్ కేక్‌లా మారిపోయింది. జియోలో వాటాలు కొనేందుకు అంబానీ ఇంటి ముందు క్యూ కడుతున్నాయి విదేశీ కంపెనీలు. రెండు నెలల వ్యవధిలోనే 1.04  లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి జియో బ్రాండ్‌ను తిరుగులేనిదిగా మార్చేశారు ముకేష్ అంబానీ.

 

టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మార్కెట్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న రిలయెన్స్ జియో... కరోనా టైమ్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలన్నీ చతికిలపడిపోయాయి. పెట్టుబడుల ప్రవాహం కూడా ఆగిపోయింది. అయితే ఈ ప్రభావం ముకేష్ అంబానీకి చెందిన జియో ఫ్లాట్‌ఫామ్‌పై మాత్రం ఏ మాత్రం పడలేదు. పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో జియో అందరి కంటే ముందుంది. గ్లోబల్ దిగ్గజాలతో వరుసగా ఒప్పందాలు కుదుర్చుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. 8 వారాల వ్యవధిలో 1.04 లక్షల కోట్ల పెట్టుబడులను సేకరించి.... 22.38 శాతం వాటాను విక్రయించారు ముకేష్ అంబానీ. 

 

ఫేస్‌బుక్‌తో పాటు మొత్తం 8 అంతర్జాతీయ కంపెనీలు రిలయెన్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. అత్యధికంగా ఫేస్‌బుక్ 9.9 శాతం వాటాను కొనుగోలు చేసింది. 43 వేల 573 కోట్లను జియోలో ఇన్వెస్ట్ చేసింది. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఫేక్‌బుక్ జియోతో చేతులు కలిపింది. ఆ తర్వాత నుంచి వరుసగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సిల్వర్ లేక్ సంస్థ రెండు విడతలుగా 10 వేల 213 కోట్ల రూపాయలను జియోలో పెట్టుబడి పెట్టింది. విస్టా ఈక్విటీ పార్టనర్స్ 11వేల 367 కోట్లు, జనరల్ అట్లాంటిక్ కంపెనీ 6598 కోట్లు , కేకేఆర్... 11, 367 కోట్లు, ముబాదలా ఇన్వెస్ట్ మెంట్ సంస్థ 9094 కోట్లు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 5683 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది.

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థను అప్పుల రహిత సంస్థగా మార్చాలని ముకేష్ అంబానీ ప్రణాళికలు వేసుకున్నారు.  ఈ ఏడాది చివరి నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్నది అంబానీ ఆలోచన. ఇప్పటికే 22.38 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఊహించని స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించారు. త్వరలో మరికొన్ని సంస్థలు కూడా జియోలో భారీ స్థాయిలో  ఇన్వెస్ట్ చేసేఅవకాశాలున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: