ఆశాస్త్రీయ విద్యుత్ బిల్లులతో ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిందని బీజేపీ ఆరోపించింది. లాక్‌డౌన్ పీరియడ్‌లో కరెంట్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసింది. అడ్డగోలు కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా విద్యుత్ కార్యాలయాల ముందు నిరసనకు బీజేపీ పిలుపునిచ్చింది.  హైదరాబాద్‌లో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్‌లు చేశారు. 

 

లాక్ డౌన్ సమయంలో విద్యుత్ శాఖ వినియోగదారుల మీటర్ల నుంచి రీడింగ్ లు తీసుకోలేదు. జూన్‌ నెలలో లాక్‌డౌన్‌ కు మినహాయింపులు రావడంతో... రీడింగ్స్ తీసుకున్న ఆ శాఖ మూడు నెలల యావరేజ్ చేసి బిల్లులను వినియోగదారులకు పంపించింది. అయితే ఈ బిల్లులపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అధికారులు, విద్యుత్తు శాఖ మంత్రి బిల్లుల పై క్లారిటీ ఇచ్చినా సంతృప్తి చెందలేదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఫిర్యాదు చేయొచ్చని విద్యుత్ శాఖ ప్రకటించింది. అయినప్పటికీ అటు వినియోగదారులు, ఇటు.. విపక్ష పార్టీలు పోరుబాట పడుతూనే ఉన్నారు. 


 
కరెంట్ బిల్లులపై విపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నేతలు రీసెంట్‌గా SPDCL సీఎండీని కలిసి విజ్ఞప్తి చేసారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో కరెంట్ ఆఫీసుల ముందు ఆందోళనకు దిగారు. హైద్రాబాద్‌.. మింట్ కంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్  కార్యాలయం ముందు ఆందోళన చేసేందుకు బయలుదేరిన కమలనాథులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తే.. మరికొందరిని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపనియకపోవడం అన్యాయమంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. 500 వచ్చే కరెంట్ బిల్లు 5 వేలు వస్తే సామాన్యులు ఎలా కడతారంటూ నేతలు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వడ్డీ వ్యాపారిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 

ఇటీవల కరోనా విషయంలో సీఎంని కలవాలని బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. SPDCL ముందు ఆందోళన చేయాలని అనుకున్న బీజేపీ నేతలకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఎక్కడ వారిని అక్కడే అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వ తీరుపై కమలనాథులు మండిపడ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: