వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారశైలిపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఆయన తాను పార్టీని వదిలి వెళ్లేది లేదని చెబుతూనే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. దేశమంతా జగన్ వైపు చూస్తుంటే, నేను బీజేపీ వైపు ఎందుకు వెళ్తాను అంటూ కొద్ది రోజుల క్రితమే వ్యాఖ్యానించిన ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వం పై చేసిన విమర్శలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలను ఆయన బయటపెట్టారు. అసలు తాను వైసీపీలో చేరాలని అనుకోలేదని, ఆ పార్టీ నేతలు తన కాళ్ళ వేళ్ళ పడి బతిమాలాడితే చేరానని  వ్యాఖ్యానించారు. అసలు తాను కాకుండా నరసాపురంలో ఇంకెవరు ఎవరు పోటీ చేసినా ఓడిపోయి ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి ఆయన మాట్లాడారు. 

 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, పేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంటే, దాంట్లోనూ కొంతమంది కమిషన్లు తీసుకుంటున్నారని, తిరుమల భూముల వేలం, ఇసుక బ్లాక్ మార్కెట్ కు తరలింపు వంటి అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. నా వ్యాఖ్యలపై కొందరు నొచ్చుకున్నారని, పార్టీ అభిమానులు కూడా తప్పు పట్టారు అని రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు.  సీఎం ను కలిసే అవకాశం లేకపోవడంతోనే నేను మీడియా ద్వారా చెప్పాల్సి వచ్చింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే వైయస్ జగన్ తోనే రఘురామకృష్ణరాజు ఎంపీ, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయ్యారని నరసాపురం శాసనసభ్యుడు ముదునూరి ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రఘురామకృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. 


ప్రసాద్ రాజు కు త్వరలోనే మంత్రి పదవి వస్తుందని, ఆయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే ఆయన వైసీపీలో ఇమడ లేకపోతున్నట్టుగా అర్థమవుతోంది. కొద్ది రోజుల క్రితమే జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఏ విషయం చెప్పాలన్నా, ముందు ఆ కోటరీ దాటుకుని వెళ్లాలి అని, కానీ ఇద్దరు ముగ్గురు ఎంపీలకు తప్ప మిగతా వారు ఎవరికి జగన్ అపాయింట్మెంట్ లభించడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోనే ఉంటానని, బీజేపీలో చేరేది లేదంటూ ఆయన చెబుతూనే, ఇప్పుడు సొంత పార్టీపై ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉండడం కాక రేపుతోంది. ఈ విషయంపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నేరుగా స్పందించకపోయినా, పార్టీ నేతలు స్పందిస్తున్నారు. 


ఇక రాజుగారి వ్యవహారం చూస్తుంటే వైసీపీతో ఇక తెగతెంపులు చేసుకోకపోయినా, ఇక పార్టీలో తాను ఎవరినీ లెక్క చేసేది లేదు అనే సంకేతాలను ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అలాగే వైసిపి కూడా ఆయనతో చర్చించి బుజ్జగించే ప్రయత్నం కూడా చేపట్టేందుకు ఇష్టపడేలా కనిపించడంలేదు. దీంతో సదరు ఎంపీ గారు వైసిపి లోనే ఉన్నా, ఆ పార్టీలో లేనట్టుగానే ఇకపై వైసిపి భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: