పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాడు. అయితే ఇతను పూర్తిస్థాయిలో రాజకీయాలు చేయడం లేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. 2014 సంవత్సరపు అసెంబ్లీ ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ తన పార్టీని స్థాపించాడు కానీ ఆ ఎన్నికలలో మాత్రం పోటీ చేయలేదు. దానికి కారణం జనసేన పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం కాలేదని చెప్పుకుంటూ విరమణ పుచ్చుకున్నాడు. కానీ టిడిపి పార్టీకి తన మద్దతు ఇచ్చి చంద్రబాబు సీఎంగా ఎంపిక అయ్యేందుకు పవన్ దోహదపడ్డాడు అని రాజకీయ వర్గాలు చెబుతారు. 


2019వ సంవత్సరపు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ముందు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజలలోకి వెళ్లలేదు. తనకి వీలుచిక్కినప్పుడల్లా రెండు మూడు కార్యక్రమాలను పెట్టి, నాలుగు డైలాగులు చెప్పి తన ఎన్నికల ప్రచారాన్ని మమ అనిపించాడు. కమ్యూనిస్టులతో పోటీ చేసి కేవలం తన పార్టీ తరపున ఒక్క సీటును మాత్రమే గెలుచుకొని అబాసుపాలు అయ్యాడు. ఇంతటి ఘోరమైన పరాజయాన్ని చవిచూసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తన రాజకీయ కెరీర్ ని బలపరచడానికి ఆసక్తి చూపడం లేదు. టిడిపి, బిజెపి పార్టీలు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అధికార పార్టీ వైసీపీ పై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని కేవలం సోషల్ మీడియా కే పరిమితం చేస్తున్నాడు. 


వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికైనా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తారా చేయరా అన్నది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్ అయ్యింది. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నానని... పార్టీ కేడర్ లేకపోయినా పర్లేదనే భావన లో పవన్ కళ్యాణ్ వున్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏది ఏమైనా జనసేన పార్టీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు కోరికలు ఇప్పట్లో నెరవేరేలా లేవని స్పష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: