ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి గతంతో పోలిస్తే 12.73 శాతం మేర వృద్ధి నమోదు అయ్యిందని సామాజిక ఆర్ధిక సర్వే వెల్లడించింది. ప్రస్తుత ధరలతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9 లక్షల 72 వేల 782 కోట్ల రూపాయలుగా నమోదు అయ్యిందని సామాజిక ఆర్ధిక సర్వే పేర్కోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి శాసనసభకు బదులుగా బయట ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇతర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు.

 

ప్రస్తుత ధరల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9 లక్షల 72 వేల 782 కోట్లుగా నమోదు అయ్యిందని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12.73 శాతం వృద్ధి నమోదు అయ్యిందని స్పష్టం చేసింది. ఇది దాదాపు 1.10 వేల కోట్లు ఎక్కువ అని ఆర్ధిక సర్వే ద్వారా ప్రణాళికా విభాగం తెలియచేసింది.  2019-20 ఆర్ధిక సంవత్సరానికిగానూ  సామాజిక ఆర్ధిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా శాసనసభలో ప్రవేశపెట్టేకంటే ముందుగానే సోషియో ఎకనామిక్ సర్వేను ప్రభుత్వం విడుదల చేసింది. నవరత్నాల్లో భాగంగా విద్య, వైద్యం, సామాజిక భద్రతా అంశాలు, రైతు సంక్షేమం, పేదల సంక్షేమం లాంటి అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యతగా సోషియో ఎకనామిక్ సర్వేలో పేర్కోన్నారు. మొత్తంగా రాష్ట్ర జీఎస్ డీపీ వృద్ధి 8.16గా ఉందని సామాజిక ఆర్ధిక సర్వే వెల్లడించింది.  స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 6 లక్షల 72 వేల 018 కోట్లు గా నమోదైనట్టు పేర్కోంది.

 

72 గంటల్లో పౌరసేవలు, ఫిర్యాదుల పరిష్కారానికి స్పందన కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రభుత్వం సామాజిక ఆర్ధిక సర్వేలో తెలియచేసింది. రామాయపట్నం, భావనపట్నం, మచిలీపట్నంలాంటి పోర్టుల నిర్మాణంతో పాటు 18 వేల 691 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆస్కారం ఉన్నట్టు తెలిపింది. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. మద్య నియంత్రణ లో భాగంగా 43 వేల బెల్టు దుకాణాలు, 4380 పర్మిట్ రూములు  రద్దు చేసినట్టు సామాజిక ఆర్ధిక సర్వేలో పేర్కోంది.

 

29 లక్షల మంది పేదలకు  ఇళ్ల స్థలాలు ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉచితంగా ఇస్తున్నట్టు ఎస్ఈసీలో వెల్లడించింది. జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టుల్లో 14 పూర్తి అయినట్టు స్పష్టం చేసింది.  మరో రెండు ప్రాజక్టుల్లో మొదటి దశ పూర్తి అయినట్టు పేర్కోంది. వంద కోట్లు దాటిన ప్రతీ టెండరూ జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపుతున్నట్టు స్పష్టం చేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా కోసం 10, 641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కోంది.46 లక్షల మంది రైతులు , కౌలు రైతులకు రైతు భరోసా కింద 6534కోట్ల పెట్టుబడి సాయం అందించినట్టు స్పష్టం చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: