కరోనా నియంత్రణ చర్యలు, ఉపాధిహామీ, వ్యవసాయం ప్రధాన ఎజెండాగా ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ప్రారంభమైంది. జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు ఈసమావేశానికి హాజరయ్యారు. కరోనా కట్టడి ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికోసం చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉపాధి హామీ నిధులతో వీలైనన్ని ఎక్కువశాఖల్లో పనులు చేపట్టేలా ప్రణాళికలుసిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లతో లక్ష కల్లాలు నిర్మించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 

 

వీటితో పాటు నీటిపారుదలశాఖలో కాలువలు, డిస్టిబ్యూటరీల పనులు ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి కలెక్టర్లు, అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ వర్షాకాలం సీజన్‌ నుంచే నియంత్రిత విధానంలో సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. విత్తనాలు, ఎరువులు, రైతు వేదికల నిర్మాణం, పంటల వివరాలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.  పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం, అర్బన్‌ పార్క్‌ల అభివృద్ధి సహా ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.


ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించిన 30 నియోజ‌క‌వ‌ర్గంలోని 50వేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు మంగ‌ళ‌వారం ప్రార‌రంభ‌మ‌య్యాయి.హైదరాబాద్‌ చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లోని.. మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మలక్‌ పేట్‌, అంబర్‌ పేట్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, జూబ్లీ హిల్స్‌, సనత్‌ నగర్‌, నాంపల్లి, కార్వాన్‌, గోషా మహల్‌, చార్మినార్‌, ఉప్పల్‌, ఎల్‌.బి.నగర్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, మేడ్చల్‌, చాంద్రాయణ గుట్ట, యాకుత్‌ పుర, బహదూర్‌ పుర, సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, పటాన్‌ చెరు నియోజకవర్గాల్లో 50 వేల మందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు లాబరేటరీలు, ఆస్పత్రులను వినియోగించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: