గుడివాడ గడ్డ...తెలుగుదేశం అడ్డా...ఇది ఒకప్పటి మాట. గుడివాడ గడ్డ...కొడాలి అడ్డా ఇది ఇప్పటి మాట. టీడీపీ ఆవిర్భావ సమయంలో ఇక్కడ నుంచి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రెండుసార్లు బరిలో దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక 1989 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతూనే వచ్చింది. 1994,1999, 2004,2009 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.

 

అయితే 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున కొడాలి నాని పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆ పార్టీ మీద అసంతృప్తితో కొడాలి వైసీపీలోకి వెళ్ళి, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున బరిలో దిగారు. గుడివాడ టీడీపీ కంచుకోట అని, కొడాలి గెలుపు అంత సులువు కాదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కొడాలి 15 వేల పైనే మెజారిటీతో గెలిచారు.

 

ఇక రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో అనేకరకాలుగా కొడాలికి చెక్ పెట్టాలని చంద్రబాబు చూశారు. కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఆఖరికి 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ని తీసుకొచ్చి పోటీ చేయించినా...కొడాలి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడం, కొడాలి మంత్రి అయిపోవడం జరిగాయి. ఇన్నేళ్లు ప్రతిపక్షంలో ఉన్న నాని...మంత్రి కావడంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇదే సమయంలో దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్లిపోవడంతో బాబు...మళ్ళీ పాత నేత రావి వెంకటేశ్వరరావుని ఇన్‌చార్జ్‌గా పెట్టారు.

 

ఎలాగో కొడాలి మీద గెలవడం కష్టం కాబట్టి, రావి పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు. అయితే రావి కాదు కదా...డైరక్ట్‌గా చంద్రబాబు వచ్చి గుడివాడలో పోటీ చేసినా సరే...కొడాలిని ఓడించడం కష్టమని ఆయన అభిమానులు అంటున్నారు. ఒకవేళ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోటీ చేస్తే ఏమన్నా పోటీ ఉంటుందేమో అని, అలా అని బాలయ్య బరిలో ఉన్నా విజయం దక్కడం కష్టం అని, కొడాలికి చెక్ పెట్టలేరని మాట్లాడుతున్నారు.

 

అయితే భవిష్యత్‌లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి, గుడివాడలో పోటీ చేస్తే పరిస్తితి మారోచ్చని, కానీ అలా జరిగే అవకాశం ఏ మాత్రం లేదని చెబుతున్నారు. ఏదేమైనా గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం కష్టమని, భవిష్యత్ ఎన్నికల్లో ఆయన విజయాలని ఎవరు ఆపలేరంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: