ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఏడాది కాలంలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నా ప్రజల్లో మద్ధతు పెంచుకోవడంలో పూర్తిగా సఫలమైంది. 90 శాతం హామీలను నెరవేర్చడంతో ప్రజలు వైసీపీ పాలన పట్ల పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాలన అనంతరం జగన్ ఇతర విషయాలపై దృష్టి పెట్టారు. 
 
గత ఐదేళ్లలో జరిగిన అవినీతి గురించి విచారణ జరిపిస్తున్నారు. టీడీపీ నాయకుల అక్రమాలపై దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో టీడీపీని రాష్ట్రంలో బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ వ్యూహం మారిందని... జగన్ కూడా కేసీఆర్ ఫార్ములాను అనుసరించబోతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ 2014లో గెలిచిన సమయంలో తక్కువ సీట్లలోనే పార్టీ విజయం సాధించింది. 
 
అనంతరం కాంగ్రెస్ నుంచి నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు రాష్ట్రంలో టీడీపీ కనుమరుగయ్యేలా చేశారు. మరోవైపు 2014లోనే జగన్ అధికారంలోకి రావాల్సి ఉన్నా బీజేపీ - జనసేన కూటమి టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో వైసీపీ ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాల్లో 22 ఎంపీ స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా చేశారు. టీడీపీలో ఉన్న బలమైన శక్తులను లాక్కుని ఆ పార్టీని బలహీనపరచాలని జగన్ భావిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వల్లభనేని వంశీ, కరణం బలరాం సొంతంగా ఇమేజ్ ఉన్న నేతలు. శిద్ధా రాఘరావు ద్వారా వైసీపీ ప్రకాశం జిల్లాలో టీడీపీని ఆర్థికంగా దెబ్బ కొట్టింది. తాజాగా వైసీపీ కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మీ వీరిని పార్టీలోకి తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి నారాయణను కూడా చేర్చుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: