ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అంతే…. ఇదే అదనుగా భావించి పాకిస్తాన్ కాశ్మీర్ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. వివరాల్లోకి వెళితే ఐఎస్ఐ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సైన్యం పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను కాశ్మీర్ లోనికి బలవంతంగా చొప్పించడానికి ప్రయత్నిస్తోందని నిఘా వర్గాల సమాచారం. భారత్ - చైనా ఉద్రిక్తతల మధ్య భారతదేశం చాలా బిజీగా ఉండటం గమనించి పాకిస్తాన్ ఇదే అవకాశంగా కాశ్మీర్ లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది.

 

తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, వైమానిక దళం చీఫ్ ముజాహిద్ అన్వర్ ఖాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ జాఫర్ మహమూద్ అబ్బాసి పాల్గొన్నారు. సమావేశాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నిర్వహించింది. ఇక సమావేశంలో నియంత్రణ రేఖ, కాశ్మీర్ పరిస్థితి గురించి చర్చించామని బహిరంగంగానే పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం అయిన ఐఎస్పిఆర్ తెలిపింది.

 

ఇదిలా ఉండగా అసలే కరోనా సమస్యతో తీరికలేకుండా పోరాడుతున్న భారత ప్రభుత్వంపై చైనా ఆకస్మిక దాడులు జరిపి విపరీతమైన ఒత్తిడికి గురి చేసిన సమయంలో పాకిస్తాన్ ఇదే అవకాశంగా తీసుకొని భారత్ లో దాడులు పాల్పడేందుకు సిద్ధపడడం గమనార్హం. ఇప్పటికే సరైన సమయం మరియు అవకాశం కోసం ఎదురు చూస్తున్న పాకిస్తాన్ వారికి పరోక్షంగా చైనా ఇలా అనవసరమై దాడులు జరిపి అందిస్తున్న పరోక్ష సహకారం చూసి కేంద్ర ప్రభుత్వం మండిపడుతోంది.

 

ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల్లో భారత ఆర్మీ భారీ సంఖ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్ బాగ్  సింగ్ మాట్లాడుతూ గత 17 రోజుల్లో 27 మంది ఉగ్రవాదులను భద్రత దళాలు హతమార్చాయి అని చెప్పారు. ఉగ్రవాదులు ఇప్పుడు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్ లో శాంతిని రూపుమాపాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపిన దిల్ బాగ్ సింగ్ వారందరినీ ఏరిపారేశామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: