ప‌ల్లెలే ప్ర‌గ‌తికి ప‌ట్టుకొమ్మ‌ల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో గ్రామీణాభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం – అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి – గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు – రైతువేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు, కరోనా – అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు. 

 

ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గదర్శకం చేశారు.  ఈసంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన మాట‌లు సీఎం మాట‌ల్లోనే గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టే. ప్లానింగ్ ఆఫ్ టౌన్, ప్లానింగ్ ఆఫ్ విలేజ్ అంటే ప్లానింగ్ ఆఫ్ స్టేట్ అన్నట్లే. వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు కావాలి. దాని ఆధారంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించాలి. దాని ప్రకారమే పనులు జరగాలి.  అలాగే కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీ చేసింది.

 


కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతీ నెలా 308 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. అసెంబ్లీలో ఇచ్చిన  హామీ మేరకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, ఐదు లక్షలకు చేరుకునేట్లు చేయ‌డం జ‌రుగుతుంది. గ్రామ పంచాయతీలకు రూ.3,694 కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు, రూ.5,885 కోట్ల నరేగా నిధులు, రూ. 337 కోట్ల పంచాయతీల సొంత ఆదాయం ఉన్నాయి. అంతా కలిపితే ఏడాదికి రూ. 9,916 కోట్లు సమకూరుతాయి. నాలుగేళ్లలో రూ.39,594 కోట్లు వస్తాయి.  ఈ నిధులింకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నిధులతో ఏఏ పనులు చేసుకోవచ్చో గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: