మనిషి ప్రాణం చాలా విలువైనది.. అందులో దేశానికి సేవలందించే సైనికుల ప్రాణాలు మరీ ముఖ్యమైనవి. ఎందుకంటే మన దేశ ప్రజలందరు కంటినిండా నిదురపోతున్నారంటే కారణం సరిహద్దుల్లో సైనికులు చేసే త్యాగాల వల్లే అని ఒప్పుకోక తప్పదు.. ఇకపోతే చైనా దుశ్చర్యల వల్ల, దూకుడు వల్ల మనదేశం 20 మంది జ‌వాన్లను కోల్పోయిన సంగతి తెలిసిందే.. ఆ 20మంది జవాన్లలో తెలంగాణ బిడ్డ‌, సూర్యాపేట నివాసి క‌ల్న‌ల్ బిక్కుమ‌ళ్ల సంతోష్ (37) కూడా ఒక‌రు.

 

 

ఇక సంతోష్ పుట్టింది సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో..1983 ఫిబ్రవరిలో జ‌న్మించారు. ఈ వీరసైనికుని తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంప‌తులు.. వీరికి కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. కాగా సంతోష్ తండ్రి ఉపేంద‌ర్ ఎస్‌బీఐ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసి, చివరికి చీఫ్‌ మేనేజర్‌గా రిటైర‌య్యారు. ఇతనికి సైన్యంలో చేరి భార‌త‌దేశానికి సేవ చేయాల‌నే త‌ప‌న ఉండగా అది నెర‌వేర‌లేదట. అందుకే తన కుమారుని ద్వార ఇతని కలను నెరవేర్చుకున్నాడట.. ఇక తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే సంతోష్ చిన్న‌నాటి నుంచే విప‌రీతంగా శ్ర‌మించాడు.

 

 

కాగా సంతోష్ 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక సంధ్య హైస్కూల్‌లో, తర్వాత 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యనభ్యసించారు. ఉన్నత విద్యకోసం పూణేకు మ‌కాం మార్చి, అక్క‌డే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత డెహ్రాడూన్‌లో సైనిక శిక్షణ చేపట్టి 2004 డిసెంబర్‌లో లెఫ్ట్‌నెంట్‌గా బీహార్‌ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌లో చేరారు.. ఈ క్రమంలో ఎన్నో గోల్డ్‌ మెడల్స్‌ను సొంతం చేసుకున్న సంతోష్‌. తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొంద‌డం విశేషం. అంతే కాకుండా ముగ్గురు చొరబాటుదారులను 2007లో అంతమొందించారు.

 

 

ఇక ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయా, లడక్, పాకిస్తాన్‌తో గల సరిహద్దులో కూడా పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించిన సంతోష్ కమాండర్‌గా ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లో విధులు నిర్వహిస్తున్నారు.. ఇకపోతే ఆదివారం రాత్రే త‌ల్లికి ఫోన్ చేసి అమ్మా బాగున్నావా..అంటూ ప‌ల‌క‌రించి 24 గంట‌లు కాక‌ముందే ఈ వీర సైనికుడు వీర‌మ‌ర‌ణం పొంద‌డం అంద‌ర్నీ క‌లిచివేస్తుంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: