తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  మ‌రోమారు త‌న రాష్ట్రం కోసం కొత్త క‌ల క‌న్నారు. ఈ మేర‌కు కీల‌క ఆదేశాల‌ను త‌న బృందానికి ఇచ్చారు. వివిధ అంశాల‌పై సుదీర్ఘంగా, స‌మ‌గ్రంగా చ‌ర్చించిన అనంత‌రం గులాబీ ద‌ళ‌ప‌తి ఈ మేర‌కు తన క‌ఠిన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లోమంగళవారం సమావేశ‌మైన  ప‌లు ఆదేశాలు వెలువ‌రించారు. పల్లె తల్లిని కాపాడుకుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.  అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంతమంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి  తీరాలని స్పష్టం చేశారు. 

 


గ్రామాభివృద్ధి  ప్రణాళిక, ఉపాధిహామీ పథకం, హరితహారం, అడవుల పునరుద్ధరణ, పల్లెప్రగతి, గ్రామాల్లో పచ్చదనం.. పరిశుభ్రత, రైతుబంధు,  రైతువేదికల నిర్మాణం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌సెజ్‌ల ఏర్పాటు, కరోనా,  అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ విస్తృతంగా చర్చించారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సీఎం చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్ల్లాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.  ప్రతి గ్రామం ప్రతిరోజు శుభ్రం కావాల్సిందేనని, ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరొకటిలేదని స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తికావాలన్నారు. రాబోయే నాలుగేండ్లలో ఏ గ్రామంలో ఏ పనిచేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్‌ కార్డు తయారుచేయాలని సీఎం చెప్పారు. గ్రామాల్లో కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో జరుగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనం చేశారు.  కాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలను ‌పాటిస్తే, గ్రామాలు బాగుప‌డ‌తాయ‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: