తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ శాఖ మాజీమంత్రి పొంగూరు నారాయణ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. గత ఐదేళ్లు మంత్రిగా చంద్రబాబు కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించిన నారాయణ...ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. త్వరలోనే ఈయన టీడీపీని వీడబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

 

అయితే నారాయణ మొన్న ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. వ్యాపారాలు ఉండటంతో రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. ఇదే సమయంలో తమ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆ మధ్య నారాయణ కుమార్తె...జగన్ భార్య వైఎస్ భారతిని కలిసినట్లు తెలుస్తోంది. మరి భారతితో భేటీ అయినప్పుడు నారాయణ కుమార్తె ఏం మాట్లాడారో తెలియదుగానీ...ఈ మధ్య కాలంలో నారాయణ టీడీపీలో యాక్టివ్ గా ఉండటంలేదు.

 

ఈ క్రమంలోనే ఆయన వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. పైగా చంద్రబాబు నాయుడు నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త నాయకుడిని ఇన్‌ఛార్జిగా కూడా నియమించారు. ఈ పరిస్థితుల్లో నారాయణ ఖచ్చితంగా టీడీపీని వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే చంద్రబాబు కొత్త్ ఇన్‌చార్జ్‌ని పెట్టినా...కూడా ఆర్ధికంగా బలంగా ఉన్న నారాయణని వదులుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సైలెంట్‌గానే ఉన్న ఎలాంటి ఇబ్బందిలేదని, కానీ పార్టీలో మాత్రం ఉండేలా చేసుకోవాలని బాబు చూస్తున్నారు.

 

ఈ క్రమంలోనే బాబు...నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రాయాదవ్ ద్వారా రాయబారం పంపినట్లు తెలుస్తోంది. ఇటీవల నారాయణ పుట్టినరోజు సందర్భంగా బీదా..హైదరబాద్‌లో ఉన్న నారాయణ ఇంటికి వెళ్ళి, శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. అయితే బాబు రాయబారానికి పంపితేనే రవి...నారాయణని కలిసినట్లు సమాచారం. ఆయన్ని పార్టీలో ఉండేలా చేయడానికే బాబు ఇలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పార్టీ మార్పుపై నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: