ఏపీ మండలిలో అసాధారణ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయాలంటే బడ్జెట్ కు ఆమోదం ఉండాలి. అలా జరగాలంటే.. బడ్జెట్ ను అసెంబ్లీ, మండలి రెండూ ఆమోదించారు. శాసనసభ ఆమోదించింది. కానీ మండలిలో మాత్రం ద్రవ్యవినిమియ బిల్లుకు మాత్రం ఆమోదం లభించలేదు. ద్రవ్యవినిమియ బిల్లు ఆమోదం పొందకుండానే మండలి నిరవధికంగా వాయిదా పడింది.

 

 

మరి ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ద్రవ్య వినిమయ బిల్లులకు మండలి ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు జీతాలివ్వలేమని, ప్రభుత్వ ఖజానా నుంచి పైసా కూడా డ్రా చేయలేమని ఆర్థిక మంత్రి బుగ్గన చేతులు జోడించి వేడుకున్నా టీడీపీ సభ్యులు వినలేదన్నారు.

 

 

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఆమోదించడం ప్రతిపక్షానికి ఇష్టం లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటున్నారు. ఆ రెండు బిల్లులను ఏదో విధంగా చెడగొట్టాలని చూస్తున్నారే తప్ప.. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా, ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయినా వారికి అవసరం లేదని మండిపడ్డారు.ఉన్నత లక్ష్యాలతో పని చేయాల్సిన సభను అప్రతిష్ఠపాలు చేస్తున్నారు మంత్రి సుభాశ్ చంద్రబోస్ విమర్శించారు.

 

 

ప్రజాసంక్షేమం, ప్రజా ప్రయోజనం జరగనివ్వమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ చైర్మన్‌ తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. మూడ్‌ ఆఫ్‌ ద ఫ్లోర్‌ తీసుకోవాలని నాలుగు గంటలుగా కోరిన పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీ, పీడీఎఫ్‌, ఇతర సభ్యుల అభిప్రాయాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. మండలి నిరవధిక వాయిదా వెనక యనమల ప్లాన్‌ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: