వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొన్ని రోజులు సొంత పార్టీపైనే రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఏకంగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ.. తాను తన సొంత బొమ్మపై గెలిచానని.. దమ్ముంటే తన నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్ బొమ్మపై గెలవాలని సవాల్ కూడా విసిరారు. తనను బతిమాలితేనే పార్టీలోకి వచ్చానంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక ఈయన విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు.

 

 

అయితే వ్యవహారం ముదురుతుండటంతో సీఎం జగన్ రంగంలోకి దిగారు. నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు విషయంపై జగన్ స్పందించారు. నేతల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు రావాలన్నారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై జగన్‌ ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నారు. ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

 

 

ఇలాంటి వాటిని సహించేది లేదని జగన్‌ సంకేతాలు పంపారు. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా చెప్పేశారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెనకాడమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పినట్లు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. నాయకులు ఒకరిపై మరొకరు సవాల్‌ విసురుకోవడం మానుకోవాలని జగన్ సూచించారు.

 

 

పార్టీ అనుమతి లేనిదే ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించరాదని జగన్ వార్నింగ్ ఇచ్చారు. నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే వర్తిస్తుందని జగన్ తెలిపారు. అంతే కాదు.. సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవమని వైసీపీనేతలు చెబుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో నరసాపురం ఎంపీ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: