ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు సీఎంలతో, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ గురించి వదంతులు వ్యాపిస్తూ ఉండటంతో సీఎం కేసీఆర్ ఆ విషయం గురించి స్పష్టత ఇవ్వాలని మోదీని కోరారు. మోదీ ఆ ప్రశ్నకు స్పందిస్తూ అన్ లాక్ 2 ఎలా అమలు చేయాలన్న దానిపై ఆలోచించాలని.... మరోమారు లాక్ డౌన్ ఉండదని తెలిపారు. 
 
కేంద్రం అన్ లాక్ 2 లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ఆంక్షలు అమలవుతున్న వ్యాపార, వాణిజ్య సంస్థలకు కేంద్రం శుభవార్త చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతులు ఇవ్వాలని... దేశంలో రైళ్ల సంఖ్యను మరింత పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మోదీ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. 
 
రాష్ట్రాల సీఎంలతో మోదీ నిర్వహించిన సమావేశంలో కరోనా, లాక్ డౌన్, ఇతర కీలక అంశాల గురించి చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా ద్వారా ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైనప్పుడు కరోనా వైరస్ మహమ్మారి గురించి విస్తృతంగా చర్చలు జరిపామని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, కరోనా రోగులను నయం చేయడం, ఆర్ధిక కార్యకలాపాలను వృద్ధి చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం ప్రజలను మరింత టెన్షన్ పెడుతోంది. దేశంలో నిన్నటివరకు 3,54,065 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,86,935 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 11,903 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: