తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగుల జీతాల్లో కోత‌లు ఆప‌డం లేదు. ఉద్యోగ సంఘాలు  ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నా...ప్ర‌స్తుతం నెల‌కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప‌ద‌ని చెబుతోంది. ఇక ప‌ద‌వీ విర‌మ‌ణ ఉద్యోగుల పించ‌న్ల‌లో కూడా కోత‌లు విధించ‌డంతో హైకోర్టు సీరియ‌స్‌గా స్పందిస్తున్న విష‌యం తెలిసిందే. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల్లో పాక్షికంగా, పూర్తిగా కోత విధించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డిజాస్టర్‌‌ అండ్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌ తీసుకు రావ‌డం గ‌మ‌నార్హం.  ఈ ఆర్డినెన్స్‌ పెన్షన్‌దారులకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్‌ దారులకు 25 శాతం కోత విధించారు. 

 

అయితే ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పెన్షన్‌ దారులు గతంలో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వం జీతాలు, పెన్షలలో కోత విధిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. మార్చి నెల‌లో లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన నాటి నుంచి  జీతాల్లో కోత‌లు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌త మూడు నెల‌లుగీఆ ప్ర‌భుత్వ ఆదాయానికి మార్గాలు మూసుకుపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త కుదుటప‌డుతోంది. అయితే స‌మ‌స్య పూర్తిగా స‌మ‌సి పోలేద‌నే చెప్పాలి. ఖ‌జ‌నా వ‌ట్టిపోతున్న ప‌రిస్థితుల్లో పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించే స్థితిలో ప్ర‌భుత్వం లేద‌నే చెప్పాలి. అందుకే కోతలు విధించ‌క త‌ప్ప‌డం లేద‌ని సీఎం కేసీఆర్ ప‌లు మార్లు స్ప‌ష్టం చేశారు.  

 

కొత్త‌గా తీసుకు వ‌చ్చిన ఆర్డినెన్స్‌ను  ఈ మేరకు గవర్నర్‌‌ ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఇప్పటి వరకు ఉద్యోగస్థులు, పెన్షన్‌దారులకు కోత విధించిన మొత్తాన్ని చెల్లించాలా అనే అంశంపై ప్రభుత్వం 6 నెలల లోపు నోటిఫికేషన్‌ విడుదల చేసి తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్‌ తర్వాత అన్ని కార్యకలాపాలు నడుస్తున్నాయని, ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ కావాల‌నే  పెన్షన్‌ దారులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని   వాపోతున్నారు. ఈ నెల 24న దీనిపై వాదనలు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: