భారత్ -చైనా సరిహద్దు..వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఉద్రిక్త పరిస్ధితులు కొనసాగుతున్నాయి. డ్రాగన్ దుశ్చర్యలతో.. మరింత అప్రమత్తమైన కేంద్రం.. సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. భారీగా బలగాలను మోహరిస్తోంది. యుద్ధ సామాగ్రిని కూడా తరలిస్తోంది. రక్షణశాఖ  ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తోంది.

 

ఓ వైపు దౌత్యమార్గంలో శాంతి ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. చైనా కుతంత్రాలను తిప్పికొట్టేందుకు .. సరిహద్దుల్లో భారీ బలగాలను మోహరిస్తోంది భారత్. తూర్పు లడ్డాక్ లోని గాల్వాన్ లోయలో సైనికులు ఘర్షణపడటం, రెండు వైపులా ప్రాణనష్టం జరగడంతో వాస్తవ నియంత్రణ రేఖ -ఎల్ఏసీ వెంబడి ఎన్నడూ లేనంత ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.   గాల్వాన్ లోయపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం తదితర పరిణామాలతో...పరిస్థితిని చక్కబెట్టేందుకు ఓవైపు చర్చలు, దౌత్యాన్ని కొనసాగిస్తూనే.. రాబోయే రోజుల్లో చైనా దూకుడును అడ్డుకునేలా దండోపాయానికి సైతం భారత్ రెడీ అవుతోంది.

 

ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో.. 20 మంది భారత జవాన్లు అమరులైన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది.  సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో ఇంచు కూడా వెనక్కి తగ్గబోమని ప్రధాని  మోడీ ప్రకటన చేసే సమయానికే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.  తదుపరి ఆదేశాల అమలుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు రెడీగా ఉండాలని ఆదేశాలు జారి చేసినట్టు సమాచారం.  దీంతో సైన్యాన్ని,భారీ ఆయుధాలతో కూడిన యుద్ధ సామాగ్రిని సరిహద్దు వద్దకు చేరుస్తోంది భారత ఆర్మీ.   యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దింపుతోంది.  ఎల్ఏసీకి సమీపంలోని ఎయిర్ బేస్ లకు ఫైటర్ జెట్లను తరలించినట్టుగా సమాచారం.  

 

గాల్వాన్ లోయలో దురాగతానికి పాల్పడటమే కాకుండా ఆ ప్రాంతం తమదేనని ప్రకటించుకున్న చైనా..  రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. దీంతో భారత్ ద్విముఖ వ్యూహాల్లో ముందడుగు వేస్తోంది. ఓవైపు దౌత్యం, శాంతి మంత్రం, మరోవైపు యుద్ధ సన్నద్ధత. ఇప్పటికే గాల్వాన్ లో 20 మంది జవాన్ల మరణాల తర్వాత భారత్ అంతటా చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. చైనా వస్తువుల బహిష్కరణకు పిలుపునిస్తూ, పలు చోట్ల ఆ దేశ జెండాలను తగులబెట్టారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: