జేసీ ఫ్యామిలీ...రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జేసీ బ్రదర్స్(జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి) 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చేశారు. ఇక ఆ ఎన్నికల్లో జేసీ దివాకర్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిస్తే, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అంతా బాగానే నడిచింది. కానీ 2019 ఎన్నికల్లో మొత్తం రివర్స్ అయింది. ఈ ఇద్దరు నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని రంగంలోకి దించారు.

 

దివాకర్ తనయుడు పవన్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే, ప్రభాకర్ తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాడిపత్రిలో ఇంతవరకు జేసీ ఫ్యామిలీకి ఓటమి తెలియదు. 1985,1989,1994,1999,2004,2009 ఎన్నికల్లో దివాకర్ వరుసగా గెలవగా, 2014 ఎన్నికల్లో ప్రభాకర్ విజయం సాధించారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది.

 

అయితే ఊహించని ఓటములతో పాటు వారి మీద పలు కేసులు వచ్చి పడ్డాయి. తాజాగా నకిలీ ఇన్సూరెన్స్ కేసులో ప్రభాకర్, అస్మిత్‌లు జైలుకు వెళ్లారు. ఈ విధంగా జేసీ ఫ్యామిలీకి ఇబ్బందులు ఎదురవ్వడంతో తాడిపత్రిలో వీరి బలం తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. జేసీ ఫ్యామిలీ వీక్ అవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంకా పుంజుకుంటున్నారు. రానున్న రోజుల్లో తాడిపత్రిపై ఈయనకు గట్టి పట్టు చిక్కే అవకాశముంది.

 

ఇక ఇక్కడే జేసీ ఫ్యామిలీకు మరో షాక్ తగలనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని నియోజకవర్గంలో టాక్. ముఖ్యంగా జేసీ కంచుకోట అయిన తాడిపత్రి మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడటం గ్యారెంటీ అంటున్నారు. ఏ మాత్రం అనుమానం లేకుండా తాడిపత్రి మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరనుందని తెలుస్తోంది. మొత్తానికైతే తాడిపత్రి జేసీ ఫ్యామిలీ చేతిలో నుంచి జారిపోతున్నట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: